Next Team India Test Captain : నాలుగు విజయాలు.. రెండు ఓటములు.. ఒక డ్రా.. టీమ్ఇండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగిన సిరీస్‌ల్లో ఫలితాలు ఇవే.. ఇంత మంచి రికార్డు ఉన్న రోహిత్‌కు ఇటీవలే ముగిసిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమ్ఇండియా మరోసారి రన్నరప్‌కే పరిమితం అవడం మింగుడుపడని అంశం. విరాట్ కోహ్లీ నుంచి కెప్టెన్సీ తీసుకున్న రోహిత్ టీమ్ఇండియాను టెస్టుల్లో నెంబర్‌వన్ పొజిషన్‌లో ఉంచినప్పటికీ ఛాంపియన్‌గా నిలబెట్టడంలో మాత్రం విఫలమయ్యాడు.
ఆసీస్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో 209 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైన తర్వాత రోహిత్ కెప్టెన్సీపై విమర్శలు వచ్చాయి. అయితే వయసు రీత్యా 36 ఏళ్లు ఉన్న రోహిత్ మరో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడతాడన్నది ఇప్పుడే చెప్పలేం. 2025లో జరిగే మూడో డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు రోహిత్ వయస్సు 38కు చేరుకుంటుంది. ఇప్పుడే సరైన ఫిట్‌నెస్ లేక ఇబ్బంది పడుతున్న రోహిత్ అప్పటివరకు కొనసాగడం కష్టమే. ఒకవేళ ఆడినా అతను కెప్టెన్‌గా మాత్రం ఉండకపోవచ్చు. అందుకే రానున్న రెండేళ్లలో జరిగే టెస్టు సిరీస్‌లకు రోహిత్ కెప్టెన్‌గా ఉండకపోతే ఎవరు కెప్టెన్ కావాలనే విషయం అభిమానుల మదిలో ఉంది.
ఇప్పటికిప్పుడు ఇదే ప్రశ్న అభిమానులకు వేస్తే అందరినోటి నుంచి వచ్చే పేరు అజింక్యా రహానె.. కాదంటే రవీంద్ర జడేజా లేదా రవిచంద్రన్ అశ్విన్. విరాట్ కోహ్లీకి అవకాశం ఉన్నా అతను మళ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకుంటాడా అంటే సందేహమే. ఇవన్నీ పక్కనబెడితే.. రోహిత్ తర్వాత టీమ్ఇండియా టెస్టు కెప్టెన్‌గా ఎవరైతే బాగుంటుందని Google AI(గూగుల్ ఏఐ)ని అడిగితే ఎవరు ఊహించని పేర్లు వెల్లడించింది.
తొలి ఆప్షన్ కేఎల్ రాహుల్
KL Rahul Test Captaincy : గూగుల్ ఏఐ తన తొలి ఆప్షన్‌గా కేఎల్ రాహుల్ పేరు వెల్లడించింది. అయితే కేఎల్ రాహుల్ ఇదివరకే టీమ్ఇండియాకు కెప్టెన్‌గా పనిచేశాడు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు కేఎల్ రాహుల్ నేతృత్వం వహించగా.. ఆ సిరీస్‌ను భారత్ గెలుచుకుంది. వైస్‌కెప్టెన్ హోదాలోనూ పనిచేసిన టీమ్ఇండియా పేలవ ఫామ్‌తో ప్రస్తుతం జట్టులోనే చోటు కోల్పోయాడు. మోకాలి సర్జరీ కారణంగా ఆటకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ ఎప్పుడు వస్తాడన్నది క్లారిటీ లేదు. అయితే వయసు ప్రాతిపాదికన కేఎల్ రాహుల్ పేరును ఏంచుకున్నట్లు తెలిసింది.
రెండో ఆప్షన్ రిషభ్ పంత్..
Risabh Pant Captaincy : గూగుల్ ఏఐ తన రెండో ఆప్షన్‌గా టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఎంచుకుంది. అయితే గతేడాది డిసెంబర్‌లో పంత్ ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోలుకుంటున్న పంత్ ఈ ఏడాది క్రికెట్ ఆడే అవకాశం తక్కువే. అయితే గతంలో టి20ల్లో టీమ్ఇండియా కెప్టెన్‌గా పనిచేసిన పంత్.. మూడు ఫార్మాట్లలోనే కీలక బ్యాటర్‌గా ఉన్నాడు.
మూడో ఆప్షన్‌గా శుభ్‌మన్ గిల్
Shubhman Gill REcords : ఇటీవల కాలంలో సం చలన ప్రదర్శన ఇస్తున్న శుభ్‌మన్ గిల్‌ను గూగుల్ ఏఐ మూడో ఆప్షన్‌గా ఏంచుకుంది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన గిల్.. డబ్ల్యూటీసీ ఫైనల్లో విఫలమయ్యాడు. కానీ అతన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ''మంచి బ్యాటింగ్ టెక్నిక్ కలిగిన గిల్ టెస్టు క్రికెట్‌లో కెప్టెన్‌గా సమర్థుడని నాకు అనిపిస్తుంది'' అంటూ గూగుల్ ఏఐ తెలిపింది.