Hardik Pandya Captaincy: టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా సెమీస్‌లోనే ఇంటిముఖం పట్టడంతో బీసీసీఐ ప్రక్షాళనకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని రద్దు చేస్తూ కొత్త సెలక్షన్ కమిటీ ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. టీమ్‌ఇండియా కెప్టెన్సీలో కూడా మార్పులకు బీసీసీఐ యోచిస్తోందని వార్తలొస్తున్నాయి. మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మని టీ20ల్లో సారథిగా తొలగించి ఆ బాధ్యతలను హార్దిక్ పాండ్యకు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది.
పొట్టి ఫార్మాట్‌లో రోహిత్ వారసుడిగా హార్దిక్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యకు కెప్టెన్సీ అంశంపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు సల్మాన్ భట్ మాట్లాడాడు. టీ20 ప్రపంచకప్ గెలవకపోయినంత మాత్రాన రోహిత్ శర్మను భారత కెప్టెన్‌గా తొలగిస్తారని తానైతే భావించడం లేదన్నాడు.
'అసలు హార్దిక్‌ను కెప్టెన్‌గా ఎవరు ముందుకు తీసుకువస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. పాండ్య టాలెంటెడ్ క్రికెటరే. అందులో సందేహం లేదు. భారత టీ20 లీగ్‌లో గుజరాత్‌ను తొలి సీజన్‌లోనే ఛాంపియన్‌గా నిలిపాడు. అలా అనుకుంటే రోహిత్ శర్మ కూడా తన జట్టుకి ఐదుసార్లు కప్‌ని అందించాడు కదా. కొన్ని మ్యాచ్‌ల్లో బాగా ఆడినంత మాత్రాన అతడికి సారథ్య బాధ్యతలు అప్పగించాలనేది సరైన వాదన కాదు. క్రికెట్ గురించి సరైన అవగాహన లేనివారే ఈ విధంగా మాట్లాడతారు. ప్రపంచకప్‌లో 12 జట్లు ఆడాయి. ఒక్క కెప్టెన్ మాత్రమే ఆ ట్రోఫీని సాధించాడు. మిగిలిన 11 జట్లు ఓడిపోయాయి. అలా అని ఆ 11 జట్ల కెప్టెన్లను మారుస్తారా?' అని సల్మాన్ భట్ తన యూట్యూబ్ ఛానల్‌లో ప్రశ్నించాడు.
టీ20 ప్రపంచకప్ రెండో సెమీస్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి తర్వాత టీమ్‌ఇండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. అక్కడ కివీస్‌తో మూడేసి టీ20లు, వన్డేలు ఆడనుంది. ఈ పర్యటనకు కెప్టెన్ రోహిత్ శర్మతో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌కు విశ్రాంతినిచ్చారు. దీంతో టీ20లకు హార్దిక్ పాండ్య, వన్డేలకు శిఖర్ ధావన్‌కు కెప్టెన్‌గా నియమించారు. తొలి టీ20 వర్షం కారణంగా రద్దవగా.. ఆదివారం రెండో టీ20 జరగనుంది.