నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న ఈ రెండో వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. హైదరాబాద్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి విజయం సాధించింది టీమిండియా. ఈరోజు అదే ఊపును కొనసాగించాలని ఉవ్విళ్లూరుతుంది.
ఉత్సాహంతో ఉరకలేస్తున్న భారత్..
రోహిత్ శర్మ, కోహ్లి ఆట గురించి బెంగపడాల్సిన అవసరం లేదు. ధావన్ విఫలమవుతుండడం జట్టు మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. రాయుడు ఫాంను అందుకోవాల్సి ఉంది. జాదవ్, ధోని గత మ్యాచ్‌లో తమ ఆటతో విమర్శకుల నోళ్లు మూశారు. ఇదే వేదికగా భారత్ ఆడిన 4 వన్డేల్లో ధోని 2 సెంచరీలు చేయడం విశేషం.
పేసర్లు బుమ్రా, షమి, స్పిన్నర్స్ కుల్దీప్ యాదవ్, జడేజా ప్రత్యర్ధి పతనాన్ని శాసింసేందుకు సిద్ధమవుతున్నారు.
గత మ్యాచ్‌లో ఓటమి పాలైన ఆస్ట్రేలియా.. విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. కెప్టెన్ ఫించ్ విఫలమవుతుండడం కంగారూ జట్టును ఆలోచనల్లో పడేసింది. మిగతా బ్యాట్స్‌మెన్ తమ పరిధి మేరకు రాణిస్తున్నారు.
బౌలర్లలో ఆడమ్ జంపా ఒక్కడే భారత బ్యాట్స్‌మెన్‌ని ఇబ్బంది పెట్టాడు. మిగతా బౌలర్ల నుంచి అతడికి సహకారం అవసరం.