టెస్టు క్రికెట్లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ బెయిర్‌స్టోకు రోజులు తగ్గిపోతున్నాయని ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. టీమ్ఇండియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో తన పేలవ ప్రదర్శన కారణంగా రాబోయే యాషెస్ సిరీస్‌లోనూ బెయిర్‌స్టోకు అవకాశం దక్కకపోవచ్చని అన్నాడు.
"జానీ బెయిర్‌స్టో ఈ టెస్టు సిరీస్‌లో లేడు. ఆస్ట్రేలియాతో పాటు ఇతర జట్లపై ఆడిన మ్యాచ్‌ల్లో అతడి బ్యాటింగ్ ఆడడం నేను చూడలేదు. ఈ విధంగా చూస్తే రాబోయే యాషెస్ సిరీస్ తుదిజట్టులో అడే అవకాశం అతడికి దక్కకపోవచ్చు. కెప్టెన్ జో రూట్, పేసర్ జేమ్స్ అండర్సన్, ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ మాత్రమే అత్యున్నత ప్రదర్శన కనబర్చారు. స్పిన్నర్ జాక్ లీచ్ ఈ పర్యటనతో తన ఖ్యాతి కొద్దిగా పెంపొందించుకున్నాడు".
- మైకేల్ వాన్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్
ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ బెయిర్‌స్టో.. టీమ్ఇండియాతో ఆడిన నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 28 పరుగులే తప్ప, మిగిలిన ఇన్నింగ్స్‌లో అసలు పరుగుల ఖాతానే తెరవకపోవడం గమనార్హం.
ఇంగ్లాండ్ జట్టు పరిమిత ఓవర్లపైనే కాకుండా టెస్టు క్రికెట్‌పై కూడా ఎక్కువ దృష్టి పెట్టాలని మైకేల్ వాన్ అన్నాడు. "టీమ్ఇండియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టు ఓడిపోయింది. ఇప్పటికైనా ఆ జట్టు వైట్-బాల్ మ్యాచ్‌లపైనే కాకుండా టెస్టు క్రికెట్‌పై కూడా దృష్టి సారించాలి. టీమ్ఇండియా గెలిచిన మూడు టెస్టుల్లోనూ ఇంగ్లాండ్‌కు అనుకూలించే పరిణామాలు జరగలేదు. ఈ మ్యాచ్‌ల్లో భారత్ కొంత సమయంలోనే ఆధిక్యాన్ని పుంజుకోగలిగింది" అని వాన్ తెలిపాడు.
ఇదీ చూడండి: పంత్‌ను ఎవరితోనూ పోల్చలేను: రవిశాస్త్రి