2018.. ఇంగ్లాండ్‌లో టెస్టుల కోసం టీమ్‌ఇండియా అడుగుపెట్టింది. అంతకు ముందు ఏడాదే వరుసగా ఏడు ఇన్నింగ్స్‌ల్లో అర్ధశతకాలతో ప్రపంచ రికార్డు సమం చేసిన ఆ భారత్ ఓపెనర్.. ఇంగ్లిష్ గడ్డపైనా రాణిస్తాడనే అంచనాలను అందుకోలేకపోయాడు. ఆ తర్వాతి ఏడాదీ పేలవ ఫామ్‌తో జట్టులో చోటు కోల్పోయాడు.
2021.. ఇంగ్లాండ్‌లో టీమ్‌ఇండియా పర్యటన. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని గొప్పగా సద్వినియోగం చేసుకున్న అదే ఓపెనర్ అద్భుత ఆటతో అదరగొడుతున్నాడు. తొలి టెస్టులో రాణించాడు. ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌లో శతకంతో విజయంలో కీలక పాత్ర పోషించాడు.
కేఎల్ రాహుల్.. టెస్టు క్రికెటర్‌గానే టీమ్‌ఇండియాలోకి 2014 చివర్లో అడుగుపెట్టాడు. ఓపెనర్‌గా తన క్లాస్ ఆటతీరుతో అభిమానులను అలరించడం మొదలెట్టాడు. సంప్రదాయ షాట్లతో కళాత్మక బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. మూడేళ్ల పాటు అతనికి తిరుగు లేకుండా పోయింది. జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్న సమయంలో అనూహ్యంగా అతడి కెరీర్ పెద్ద కుదుపునకు లోనయ్యింది. పరుగులు చేయాలన్న ఆత్రుతలో అతడు వరుసగా విఫలమవుతూ వచ్చాడు. ఒకే బంతిని వీలైనన్ని విభిన్న రకాలుగా ఆడే నైపుణ్యంగల అతడు.. పేలవ షాట్‌లతో నిరాశపరచడం అలవాటుగా చేసుకున్నాడు.
షాట్ల ఎంపికపై నియంత్రణ కోల్పోయిన అతను.. పరుగులు చేయడంలో వెనకబడ్డాడు. ఫామ్ కోల్పోవడం వల్ల 2019 ఆగస్టులో వెస్టిండీస్ సిరీస్ తర్వాత అతనిపై వేటు పడింది. ఆ తర్వాత అతను లేకుండానే టీమ్‌ఇండియా 16 టెస్టులు ఆడేసింది. మరోవైపు పృథ్వీ షా, మయాంక్, శుభ్‌మన్ గిల్ లాంటి ఆటగాళ్లు ఓపెనింగ్ స్థానంపై కన్నేయడం వల్ల రాహుల్ తిరిగి టెస్టుల్లోకి రావడం కష్టమేననిపించింది. కానీ ఇప్పుడు ఇంగ్లాండ్‌లో అనుకోకుండా వచ్చిన అవకాశం అతని నిరీక్షణకు ఫలితాన్ని అందిస్తోంది.
పూర్తిగా మారి!
గతంలో పూర్తిగా ఫలితంపైనే దృష్టి పెట్టిన రాహుల్.. ఆటతీరు గురించి ఆలోచించలేదు. అందుకే పరుగులు చేయాలనే తొందరలో ఎలా పడితే అలా ఆడి ఔటయేవాడు. కానీ ఇప్పుడు ఫలితం గురించి పట్టించుకోకుండా సరైన షాట్‌ల ఎంపికతో బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తున్నాడు. ఇంగ్లాండ్‌తో టెస్టుల్లో ఓపికతో గంటల పాటు క్రీజులో కుదురుకుని.. ఓవర్లకు ఓవర్లు కరిగించేస్తూ, సరికొత్తగా కనిపిస్తున్నాడు. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌ల్లో 214 బంతుల్లో 84 పరుగులతో పునరాగమనాన్ని ఘనంగా చాటాడు.
లార్డ్స్‌లో తన శతక ఇన్నింగ్స్ చూస్తే అతనెంత పరిణతి చెందాడో అర్థమవుతోంది. వేగంగా పరుగులు చేయడానికి ఎలాంటి షాట్లు ఆడాలో అతనికి తెలుసు. కానీ ఈ ఇన్నింగ్స్‌లో తన తొలి బౌండరీ సాధించడానికి అతను 108 బంతులు తీసుకున్నాడంటే ఎంత ఓపికతో ఉన్నాడో తెలుస్తోంది. ఏ దశలోనూ తొందరపడలేదు. బంతికి బ్యాట్‌ను తాకించేందుకు ఆత్రుత ప్రదర్శించలేదు. తన మునుపటి బ్యాటింగ్‌కు విరుద్ధంగా చాలా బంతులను వదిలేస్తూ కనిపించాడు. వేటాడేటప్పుడు ఓపికతో ఉండే పులిలా.. గంటల పాటు క్రీజులో నిలిచిన అతను సరైన సమయం రాగానే తన క్లాసిక్ షాట్లను బయటపెట్టాడు. ఏ బంతికి ఎలాంటి షాట్ ఆడాలనే ఓ స్పష్టమైన అవగాహన పెంపొందించుకున్నాడు. అనవసరంగా బంతులను వెంటాడలేదు.
2015లో అతను మ్యాచ్‌ల్లో ఆడకుండా వదిలిపెట్టిన బంతుల శాతం 13గా ఉంటే.. ఈ ఏడాది అది 30గా ఉంది. తన స్టాన్స్‌ను కూడా మార్చుకున్న అతను.. ఇప్పుడు క్రీజులో వీలైనంత ఎక్కువ దూరాన్ని కవర్ చేసేలా నిలబడుతున్నాడు. రోజుల తరబడి గంటల పాటు నెట్స్‌లో ప్రాక్టీస్‌తో తన ఆటతీరును మార్చుకుని ఇప్పుడు పరుగులు సాధిస్తున్నాడు. ఓవైపు రోహిత్ పాతుకుపోయినప్పటికీ మరో ఓపెనర్ విషయంలో మాత్రం జట్టుకు ఓ నిర్దేశిత ఆటగాడంటూ లేడు. షా, మయాంక్, గిల్.. ఇలా ఓపెనర్లు తరచూ మారుతున్నారు. గాయాలు లేదా ఫామ్.. ఇలా సమస్య ఏదైనా అది జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఓపెనర్‌గా టెస్టుల్లో సరికొత్త ఆటతీరుతో ఆకట్టుకుంటున్న రాహుల్.. ఇదే జోరు కొనసాగిస్తే జట్టులో సుస్థిర స్థానం ఖాయం. జట్టు ఓపెనింగ్ కష్టాలూ తీరిపోతాయి.
"టెస్టు క్రికెట్లోనూ ప్రతి బంతికీ రెండు లేదా మూడు రకాల షాట్లు ఆడగలనని భావించేవాణ్ని. అలా ప్రయత్నించి గతంలో విఫలమయ్యా. ఏ బంతికి ఎలాంటి షాట్ ఆడాలోననే అయోమయంలో ఉండేవాణ్ని. ఎక్కువ షాట్లు ఆడేవాణ్ని. ఆ తర్వాత నాకు నియంత్రణ అవసరమని తెలుసుకున్నా. షాట్ల ఎంపికలో ఓ ప్రణాళిక ఉండాలని గుర్తించా" అని ఓపెనర్ కేఎల్ రాహుల్ అన్నాడు.
ఇదీ చూడండి.. అలా ఔట్ కావడం చిరాకేసింది: రాహుల్