ఇంగ్లాండ్- టీమ్ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటకు వర్షం అడ్డంకిగా మారింది. దీంతో మ్యాచ్‌ను అర్ధంతరంగా నిలిపివేసి టీ బ్రేక్ ప్రకటించారు. అనంతరం రెండు సార్లు ప్రారంభించినా(మూడు బంతులు వేసి) వర్షం కారణంగా మళ్లీ ఆపివేశారు.
మొత్తంగా ఆట ముగిసే సమయానికి 33 ఓవర్లు సాగిన ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఆరంభంలో బాగా ఆడినప్పటికీ.. చివర్లో ఇంగ్లాండ్ బౌలర్లు చెలరేగారు. భారత జట్టు 46.1 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(57), పంత్ (7) ఉన్నారు. టీమ్‌ఇండియా ఇంకా 58 పరుగుల వెనుకంజలో ఉంది.
ఆట సాగిందిలా..
21/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో బరిలోకి దిగిన టీమ్ఇండియాకు మంచి శుభారంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్(36), రాహుల్ నిలకడగా ఆడారు. దూకుడుగా ఆడుతున్న రోహిత్ శర్మకు(36) సామ్‌కరన్ అడ్డుకట్ట వేశాడు. ఫలితంగా 97 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. భోజన విరామానికి ముందు 97/1తో పటిష్టస్థితిలో నిలిచిన భారత జట్టు తర్వాత ఒక్కసారిగా కుప్పకూలింది. స్వల్ప తేడాలో పుజారా(4), కెప్టెన్ కోహ్లీ(0), వైస్ కెప్టెన్ అజింక్య రహానె(5) ఔటవ్వడం వల్ల భారత్ కష్టాల్లో పడింది. ఈ క్రమంలోనే రాహుల్, పంత్ నిలకడగా ఆడుతూ జట్టు స్కోరును గాడిలో పెడుతున్నారు. అంతలోనే వాతావరణం అనుకూలించక అంపైర్లు ఆటను నిలిపివేశారు. కాసేపటికే వర్షం ప్రారంభమైంది.
అంతకుముందు మొదటిరోజు ఆటలో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకు ఆలౌటైంది. బుమ్రా(4/46) షమి(3/28 ), శార్దూల్(2/41), సిరాజ్(1/48) ప్రత్యర్థులను చిత్తు చేశారు. ఇంగ్లాండ్ జట్టులో కెప్టెన్ జో రూట్(64) ఒక్కడే రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా 13 ఓవర్లు ఆడి 21/0 తొలి రోజు ఆటను ముగించింది.
ఇదీ చూడండి: Ind vs Eng Test: లంచ్ సమయానికి టీమ్ ఇండియా 97/1