చెపాక్ వేదికగా జరిగిన రెండో టెస్టు ఓటమిపై ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ స్పందించాడు. మూడు విభాగాల్లోనూ భారత్ తమపై ఆధిపత్యం ప్రదర్శించిందని తెలిపాడు. విజయానికి వారే సంపూర్ణ అర్హులని పేర్కొన్నాడు.
ఈ టెస్టులో భారత్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. మ్యాచ్ ఆసాంతం ఇండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. విజయానికి వారు సంపూర్ణంగా అర్హులు. క్రెడిటంతా టీమ్ఇండియాకు దక్కుతుంది. ఈ ఓటమి మాకొక గుణపాఠం. రెండో రోజు నుంచి పిచ్ బ్యాటింగ్‌కు కష్టంగా మారింది. సిరీస్ 1-1తో సమమైంది. తదుపరి రెండు టెస్టులపై మేము దృష్టి పెట్టనున్నాము. అహ్మదాబాద్ వేదికగా జరిగే డే/నైట్ టెస్టుకు అదనపు స్పిన్నర్‌తో బరిలోకి దిగుతాం.
-జో రూట్, ఇంగ్లాండ్ కెప్టెన్.
రొటేషన్ పాలసీపై స్పందిస్తూ..
తొలి టెస్టులో అద్భుతంగా రాణించిన అండర్సన్, జోస్ బట్లర్ లాంటి ఆటగాళ్లను రొటేషన్ పాలసీపై పక్కకు పెట్టడం జట్టుకు చేటు చేసిందని ఇంగ్లాండ్ మాజీలు విమర్శించారు. దీనిపై ఇంగ్లీష్ జట్టు సారథి స్పందించాడు. ఓటమికి ఆ విధానం కారణం కాదని తెలిపాడు. ఇక్కడ గెలుపొందడానికి కావాల్సిన ఆటగాళ్లు తమ జట్టులో ఉన్నారని రూట్ పేర్కొన్నాడు.
జట్టులో ఉన్న ఆటగాళ్లను సరిగా ఉపయోగించుకోవడం నా బాధ్యత. అందుకు నా శక్తి మేరకు నేను పని చేస్తున్నాను. కొంతమంది అద్భుతమైన ఆటగాళ్లు మా టీమ్‌లో ఉన్నారు. ఇక్కడ గెలవడానికి కావాల్సిన సత్తా వారిలో ఉంది.
-జో రూట్, ఇంగ్లాండ్ కెప్టెన్.
ఇదీ చదవండి: ' టాస్ వాళ్లు గెలిచినా మ్యాచ్ మేమే గెలిచే వాళ్లం '