టెయిలెండర్లు ప్రతిసారి రాణిస్తారని పొరబడటం వల్లే మూడో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయిందని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెేల్ వాన్ అన్నాడు. 8 నుంచి 11వ స్థానంలో ఆడే ఆటగాళ్లందరూ ప్రతి ఇన్నింగ్స్‌లో బాగా ఆడరని పేర్కొన్నాడు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రాకతోనే జట్టు సమతూకం అవుతుందని అభిప్రాయపడ్డాడు. తొలి రెండు టెస్టుల్లో స్పిన్ బౌలింగ్ కూడా కీలక పాత్ర పోషించిందని.. అలాంటప్పుడు అశ్విన్ జట్టులో లేకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపాడు.
"భారత్ కచ్చితంగా తరువాతి టెస్ట్‌లో అశ్విన్‌ను టీమ్‌లోకి తీసుకోవాలి. జట్టులో ఉన్న 11మందిలో ఎనిమిదో స్థానంలోని వారిపై ఆధారపడటం సబబు కాదు. లార్డ్స్ టెస్టులో షమీ ఇన్నింగ్స్‌తో భారత్ టెయిలెండర్లపై ఎక్కువ నమ్మకం ప్రదర్శించింది. వాస్తవానికి షమీని ఎనిమిదో స్థానంలో ఆడనివ్వొద్దు."
-మైకేల్ వాన్, ఫేస్‌బుక్ పోస్ట్
ఇంగ్లాండ్‌ని గెలిపించేందుకు జో రూట్ సహచర ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాడని.. దీనితో అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్‌గా నిలిచాడని వాన్ ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లాండ్ తరఫున 55టెస్టు మ్యాచులకు జో రూట్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అందులో 27మ్యాచుల్లో జట్టును విజయతీరాలకు చేర్చి కొత్త రికార్డు సృష్టించాడు.
లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే ఆలౌట్ అయింది. చివరికి 278 పరుగులకు ఆలౌటై ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో సిరీస్ 1-1 తేడాతో సమమైంది. నాలుగో టెస్టు సెప్టెంబర్ 2న లండన్ వేదికగా ప్రారంభంకానుంది.
ఇవీ చదవండి: