స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయం పాలైంది. లక్ష్య ఛేదనలో ఇండియా బ్యాట్స్మెన్లు చేతులేత్తేశారు. ఏ దశలోనూ కనీస ప్రతిఘటన చూపలేదు. పర్యటక జట్టు కట్టుదిట్టమైన ఫీల్డింగ్‌కు తోడు పిచ్ కూడా వారికి సహకరించింది. అద్భుత ద్విశతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన జో రూట్‌ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది.
అయిదవ రోజు మరో 45.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా.. 192 పరుగులకు ఆలౌటైంది. 227 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన రూట్ సేన నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(72), గిల్(50) మినహా ఎవరూ రాణించలేదు. రహానె, సుందర్, నదీమ్‌లు డకౌటయ్యారు. జాక్ లీచ్(4 వికెట్లు), జేమ్స్ అండర్సన్(3 వికెట్లు)లు తీసి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఓవర్‌నైట్ స్కోరు 39/1తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. క్రీజులో కుదురుకుంటున్న పుజారాను లీచ్ పెవిలియన్ చేర్చాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ కోహ్లీ.. గిల్‌తో కలిసి జట్టును కాపాడే ప్రయత్నం చేశాడు. 26వ ఓవర్లో బౌలింగ్‌కు దిగిన అండర్సన్ టీమ్ఇండియాను గట్టి దెబ్బ కొట్టాడు. వరుసగా గిల్, రహానెలను క్లీన్ బౌల్డ్ చేశాడు. తక్కువ ఎత్తులో వచ్చిన బంతులను అంచనా వేయడంలో ఈ ఇద్దరూ విఫలమయ్యారు. తర్వాత ఏ దశలోనూ భారత్ కోలుకోలేదు.
పోరాడిన కోహ్లీ..
లక్ష్య ఛేదనలో భారత బ్యాట్స్మెన్లు ఘోరంగా విఫలమయ్యారు. ఓపెనర్ గిల్, విరాట్ కోహ్లీలు అర్ధ సెంచరీలు చేసి ఊపుమీద కనిపించినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఓ ఎండ్‌లో కెప్టెన్ కోహ్లీ ప్రతిఘటించిన అతనికి సహకారం అందించేవారే కరవయ్యారు. కొద్ది సేపు అశ్విన్ అండగా నిలిచాడు. 54 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది ఈ జోడీ. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను లీచ్ విడగొట్టాడు. కోహ్లీ.. చివరికి స్టోక్స్ బౌలింగ్‌లో 8వ వికెట్‌గా వెనుదిరిగాడు.
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన వారంతా త్వరగానే అవుటయ్యారు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో టెస్టు ఈనెల 13 నుంచి చెన్నై వేదికగా ప్రారంభమవుతుంది.
30 ఏళ్ల రికార్డును తిరగరాసిన రూట్ సేన..
ఆస్ట్రేలియా గబ్బా స్టేడియంలో కంగారూలకు 32 ఏళ్లుగా ఎదురేలేదు. కానీ, ఇటీవల జరిగిన టెస్టులో అజింక్య రహానె నాయకత్వంలోని టీమ్ఇండియా విజయకేతనం ఎగురవేసింది. అదే విధంగా చెపాక్ స్టేడియంలో 30 ఏళ్లుగా ఇంగ్లాండ్‌కు విజయమే దక్కలేదు. ఈ టెస్టు విజయంతో రూట్ సేన తాజాగా రికార్డు సృష్టించింది.
ఇదీ చదవండి: ఆ విషయంపై ఐసీసీకి దక్షిణాఫ్రికా బోర్డ్ లేఖ