Olivier on Kohli: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కోసం సిద్ధమవుతోంది టీమ్ఇండియా. ఇటీవలే అక్కడికి చేరుకున్న భారత ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో చెమటోడుస్తున్నారు. అయితే ప్రస్తుతం సౌతాఫ్రికా జట్టు కాస్త బలహీనంగా ఉండటం కోహ్లీసేనకు సానుకూలాంశమే. ఈ నేపథ్యంలోనే స్పందించిన సఫారీ బౌలర్ ఒలివర్.. కోహ్లీకి బౌలింగ్ చేయడం చాలా కష్టమని తెలిపాడు.
"ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో నిండి ఉన్న టీమ్‌ఇండియా లాంటి బలమైన జట్టుతో టెస్టు సిరీస్ ఆడనుండటం నా కెరీర్‌లోనే మరిచిపోలేని విషయం. విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాడికి బౌలింగ్ చేయడం కష్టమే. అయినా, అతడికి బౌలింగ్ చేసేందుకు ఎదురు చూస్తున్నా. ఇక్కడి పిచ్ పరిస్థితులపై అవగాహన ఉండటం మాకు కలిసొచ్చే అంశం. బలమైన భారత జట్టును ఎదుర్కొనేందుకు పూర్తిగా సంసిద్ధమవుతున్నాం."
-ఒలివర్, సౌతాఫ్రికా బౌలర్
ఇప్పటి వరకు 10 టెస్టులు ఆడిన ఒలివర్ 48 వికెట్లు పడగొట్టాడు. డిసెంబరు 26 నుంచి సెంచూరియన్ వేదికగా ఇరుజట్లు తొలి టెస్టులో పోటీపడనున్నాయి.