బలహీనమైన ప్రత్యర్థితో ఆడాలని తాము కోరుకోవట్లేదని టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli) అన్నాడు. పూర్తి సామర్థ్యంతో కూడిన ఇంగ్లాండ్ జట్టును తాము ఓడించగల సత్తా మా సొంతమని ధీమా వ్యక్తం చేశాడు. మూడో టెస్టుకు సిద్ధం చేసిన పిచ్ ఆశ్చర్యపరిచిందని పేర్కొన్నాడు. విజయానికి అవకాశాలు మెండుగా ఉన్న తొలి టెస్టు డ్రాగా ముగియడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
అది సరైన ప్రశ్న కాదు..
మూడో టెస్టుకు ముందు విలేకరులు అడిగిన ప్రశ్నలకు విరాట్ జవాబిచ్చాడు. బెన్‌స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, క్రిస్‌వోక్స్, మార్క్ వుడ్, డామ్ సిబ్లీ.. వంటి ఆటగాళ్లు లేరు కాబట్టి ఇంగ్లాండ్‌పై విజయం సాధించేందుకు ఇదే మంచి తరుణమని భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు అతడు సమాధానం ఇచ్చాడు. 'మంచి తరుణం ప్రత్యర్థి బలాన్ని బట్టి ఉంటుందా? కీలక ఆటగాళ్లు ఉన్నా మేం వారిని ఓడించగలం. ప్రత్యర్థి బలహీనంగా ఉండాలని మేం కోరుకోం. మీరడిగిన ప్రశ్న సరికాదని నా ఉద్దేశం. మేం కొన్నేళ్లుగా అద్భుతమైన క్రికెట్ ఆడుతున్నాం' అని కోహ్లీ అన్నాడు.
అహం చంపుకోవాలి..
ఇంగ్లాండ్ పిచ్‌లపై ఆడేటప్పుడు అహం చంపేసుకోవాలని కోహ్లీ సూచించాడు. ఇక్కడి వికెట్లపై 30-40 పరుగులు చేస్తే కుదురుకున్నట్టుగా భావించొద్దన్నాడు. ప్రపంచంలోని ఎక్కడి స్టేడియంతో పోల్చినా ఇంగ్లాండ్‌లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయని తెలిపాడు. ఓపికగా, క్రమశిక్షణగా ఆడాల్సి ఉంటుందన్నాడు. లార్డ్స్ టెస్టులో పరస్పరం కవ్వించుకోవడంపై అతడు స్పందించాడు. ఏం మాటలు అనుకున్నామో మాత్రం బయటకు చెప్పబోమని స్పష్టం చేశాడు.
'మేం అనుకున్న మాటల గురించి బహిరంగంగా చెప్పబోం. కెమెరా, స్టంప్ మైక్ ఆధారంగా మేం ఆ మాటలను విశ్లేషించుకున్నాం. ఆ పరిస్థితుల్లో జరిగే వాటిని బట్టి అదనపు ప్రేరణ లభిస్తుంది. అయితే మ్యాచ్ ముగిశాక వాటిని పట్టించుకోం. ఇక మేం చరిత్రను పట్టించుకోవడం లేదు. ఒక చోట గతంలో ఓడిపోతే భవిష్యత్తులోనూ అక్కడ ఓడిపోతామని కాదు. అన్నీ మన మనస్తత్వంపై ఆధారపడి ఉంటాయి' అని భారత కెప్టెన్ తెలిపాడు.
ఇదేం పిచ్..
మూడో టెస్టు పిచ్ తమను విస్మయపరిచిందని విరాట్ అన్నాడు. కారణం లేకుండా తమ జట్టు కూర్పును మార్చబోమని వెల్లడించాడు. 'ఆటగాళ్లు గాయపడితే తప్ప గెలుపు కూర్పును మార్చబోం. రెండో టెస్టులో అద్భుత విజయం సాధించిన తర్వాత ఆ ఆలోచన చేయబోం. అయితే పిచ్‌ను బట్టి స్వల్ప మార్పులు ఉంటాయి. మేం ఎప్పుడైనా 12 మందితో జట్టును సిద్ధం చేస్తాం. మొదటి, మూడు, నాలుగు రోజుల్లో పిచ్‌ను అంచనా వేసి తుది 11 మందిని ఎంపిక చేస్తాం. ప్రస్తుత పిచ్ మాత్రం విస్మయపరిచింది. మేం పచ్చికతో ఉంటుందనుకున్నాం. కానీ అలా లేదు. కాబట్టి అశ్విన్‌కు దారులైతే మూసుకుపోలేదు' అని విరాట్ పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: ధోనీ రూ.100 కోట్ల పరువు నష్టం దావా- విచారణ వాయిదా