Dhoni Quit as CSK Captain: అంతా అనుకున్నట్టే జరిగింది. ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ధోనీ కొనసాగుతాడా? లేదా? అని కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. మరో రెండు రోజుల్లో ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ విషయాన్ని ఫ్రాంఛైజీ సోషల్‌మీడియా ద్వారా తెలిపింది. ఈ సీజన్ నుంచి కెప్టెన్ బాధ్యతలను రవీంద్ర జడేజాకు అప్పగించనున్నట్లు వెల్లడించింది.
2008 నుంచి చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్‌గా మహీ ఉన్నాడు. అతడి సారథ్యంలో 12 సీజన్లు ఆడిన సీఎస్కే 11 సార్లు ప్లేఆఫ్స్ చేరింది. అత్యధికంగా 9సార్లు ఫైనల్ ఆడి, నాలుగు సార్లు టైటిల్‌ను ముద్దాడింది. 2010, 2011, 2018, 2021లో ఐపీఎల్ విజేతగా సీఎస్కే నిలిచింది. ధోనీ ఆడని 6 మ్యాచుల్లో సురేష్ రైనా సీఎస్‌కే కెప్టెన్‌గా వ్యవహరించాడు
ఒకే జట్టుకు కెప్టెన్‌గా.. ఐపీఎల్ చరిత్రలో 2008 నుంచి ఇప్పటివరకు ఒకే జట్టుకు కెప్టెన్‌గా కొనసాగింది ధోనీ ఒక్కడే. చెన్నై సూపర్ కింగ్స్‌కు సారథ్యం వహించిన ఇతడు ఇప్పటివరకు నాలుగు సార్లు జట్టుకు ట్రోఫీని అందించాడు. మొత్తంగా 204 మ్యాచులకు సారథ్యం వహించిన ధోనీ.. 121 మ్యాచుల్లో విజయం సాధించాడు. ఇతడి విజయశాతం 59.60 గా ఉంది. మొత్తంగా ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు 4,632 పరుగులు చేశాడు. 17 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు.
వేలం సమయంలోనే.. ఐపీఎల్ 2022 మెగా వేలం ప్రక్రియ జరుగుతున్న సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ అంశం చర్చల్లోకి వచ్చింది. చెన్నై యాజమాన్యం ధోనీ స్థానంలో జడేజాకు కెప్టెన్ పగ్గాలు అప్పగించనుందనే వార్తలు విస్తృతంగా వినిపించాయి. గతంలో పలువురు మాజీలు కూడా సీఎస్కేను నడిపించే సామర్థ్యం ఉన్న ఆటగాడు జడేజానే అని అభిప్రాయపడ్డారు. అయితే అప్పుడు ఫ్రాంఛైజీ మాత్రం ధోనీనే సారథి అని తెలిపింది. కానీ మెగా వేలానికి మందు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (రూ.16 కోట్లు), ధోనీ (రూ.12 కోట్లు), మొయీన్ అలీ (రూ.8 కోట్లు), రుతురాజ్‌లను(రూ. 6 కోట్లు) రిటైన్ చేసుకుంది. ఈ నిర్ణయం ద్వారా యాజమాన్యం కూడా ధోని తర్వాత కెప్టెన్ ఎవరో చెప్పకనే చెప్పినట్లయింది.
జడేజా రాణిస్తాడా.. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్‌కు కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్నాడు రవీంద్ర జడేజా. ఇప్పటివరకు జడ్డూ 200 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి.. 2386 పరుగులు చేశాడు. 127 వికెట్లు పడగొట్టాడు. ఫీల్డర్‌గా గొప్పగా రాణించాడు. ఐపీఎల్ 2008 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగ్రేటం చేసిన రవీంద్ర జడేజా, 14 సీజన్ల తర్వాత (బ్యాన్ కారణంగా ఐపీఎల్ 2010 సీజన్‌లో ఆడలేదు) కెప్టెన్‌గా బాధ్యతలు అందుకోబోతున్నాడు. స్టార్ ఆల్‌రౌండర్‌గా సూపర్ సక్సెస్ అందుకున్న జడేజా, సారథిగా సక్సెస్ అవుతాడా? లేదా? అనేది చూడాలి.
ఇదీ చూడండి: IPL 2022: హ్యాట్రిక్ వికెట్ల వీరులు వీరే.. రోహిత్ శర్మ సహా..