దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్(2007)లో 25 సంవత్సరాల వయసులోనే కెప్టెన్సీ అందుకున్నాడు ధోనీ. సరిగ్గా 14 ఏళ్ల క్రితం సెప్టెంబర్ 14, 2007న కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్ ఆడాడు. అదీ టీ20 ప్రపంచకప్‌లాంటి మెగాటోర్నీలో. కెప్టెన్‌గా తొలి సిరీస్ అయినా ఎలాంటి ఒత్తిడి లేకుండా జట్టును ముందుండి నడిపించి టీమ్ఇండియాను విశ్వవిజేతగా నిలిపాడు మహీ. ఇక అక్కడనుంచి అతడు వెనుదిరిగి చూసుకోలేదు. వన్డే ప్రపంచకప్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడి భారత క్రికెట్‌కు నవశకాన్ని పరిచయం చేశాడు. మొత్తంగా 72 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించి, 41 మ్యాచ్‌లను గెలిపించాడు. టీ20 చరిత్రలో ధోనీ అత్యంత విజయవంతమైన కెప్టెన్ అని చెప్పడానికి ఈ గణాంకాలు చాలు. ఈ గణాంకాలే వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీసేనకు మహీని మెంటార్‌గా బాధ్యతలు స్వీకరించేలా చేశాయి.
ఐపీఎల్‌లోనూ..
ఐపీఎల్‌లోనూ మహీకి ఎవరూ సాటిరారు. 2008లో లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి మూడుసార్లు చెన్నై సూపర్‌కింగ్స్‌ను విజేతగా నిలిపాడు. 8 సార్లు జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఈ టోర్నీలో 100 విజయాలు సాధించిన తొలి కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు.
ప్రపంచంలోనే ఏకైక వ్యక్తి
మూడు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక కెప్టెన్‌గానూ ధోనీ రికార్డు నెలకొల్పాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను తన ఖాతాలో వేసుకున్నాడు.
టెస్టు ర్యాంకింగ్‌లో నంబర్ వన్
2009లో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఘనత సాధించిన భారత తొలి కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు. ఇప్పటివరకు 60 టెస్టులకు నాయకత్వం వహించగా ఇందులో 23-18 గెలుపు-ఓటములు ఉన్నాయి.
ఆపద్భాంధవుడు
ధోనీ..బ్యాటింగ్ చేయగల వికెట్ కీపర్ దొరక్క రాహుల్ ద్రవిడ్‌పై అదనపు భారం మోపి లాక్కొస్తున్న రోజులవి. పార్థివ్ పటేల్, అజయ్ రాత్రాల లాంటి వచ్చివెళ్లే వాళ్లు తప్ప స్థిరత్వం ఉన్న కీపర్ బ్యాట్స్‌మన్ దొరకడం లేదు. అలాంటి సమయంలో 2004లో టీమ్ఇండియా తలుపు తట్టాడు ధోనీ. కొద్దిరోజుల్లోనే నమ్మదగ్గ కీపర్‌గా, భరోసా ఉంచదగిన బ్యాట్స్‌మన్‌గా మారిపోయాడు. జట్టులోకి వచ్చిన మూడేళ్లలోపే సారథిగా మారి, దశాబ్దం పాటు ముందుండి నడిపించాడు.
ఆ రికార్డు సాధించిన తొలి భారత కెప్టెన్
200 వన్డేలకు కెప్టెన్సీ వహించిన ధోనీ.. 110 విజయాలు ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా 100కు పైగా వన్డే మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించిన ఏకైక ఆస్ట్రేలియేతర సారథిగా చరిత్ర సృష్టించాడు. సచిన్ తర్వాత 10 వేల పరుగుల మైలురాయి అందుకున్న 4వ భారతీయ క్రికెటర్, రెండో వికెట్ కీపర్‌గా నిలిచాడు.
వికెట్ కీపర్.. 200 వన్డేలకు సారథ్యం
ఓ వికెట్ కీపర్ దాదాపు 200 మ్యాచ్‌లకు సారథ్యం(Dhoni as Captain) వహించిన రికార్డు ధోనీదే. ఒకే ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లలో భాగస్వామ్యంతో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. మహీ కెప్టెన్సీలోనే భారత్.. 2011 వన్డే ప్రపంచ విజేతగా నిలిచింది. 2015 ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరింది.
సొంతగడ్డపై ఎక్కువ.. విదేశాల్లో తక్కువ
2005 డిసెంబర్ 2న టెస్టు అరంగేట్రం చేశాడు ధోనీ. తన పదేళ్ల కెరీర్‌లో 90 టెస్టులు ఆడాడు. 4 వేల 876 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్లో అతడి అత్యధిక స్కోరు 224. 60 టెస్టుల్లో కెప్టెన్‌గా 27 విజయాలు అందించాడు. 15 మ్యాచ్‌లు డ్రాగా ముగిస్తే, 18 మ్యాచ్‌ల్లో భారత్ ఓడింది.2009లో ధోనీ ఉన్నప్పుడే భారత్.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్రస్థానం సంపాదించింది. సొంతగడ్డపై ఎక్కువ విజయాలు అందుకున్నాడు. విదేశాల్లో మాత్రం అత్యధిక పరాజయాలు మూటగట్టుకున్న టీమ్ఇండియా సారథిగా నిలిచాడు. టెస్టుల్లో 4వేల పరుగులు చేసిన తొలి భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ధోనీనే. ఈ ఫార్మాట్లో 38 స్టంపింగులు చేశాడు మహీ. టెస్టుల్లో ఇదే అత్యధికం.
మెంటార్‌గా సక్సెస్ అవుతాడా?
భారత జట్టుకు ఎన్నో మరపురాని విజయాలు అందించిన ధోనీని వచ్చే నెలలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌కు మెంటార్‌గా ఎంపిక చేసింది బీసీసీఐ. ప్రపంచకప్‌ల్లో మెరుగైన రికార్డు, కెప్టెన్సీపై కచ్చితమైన అవగాహన, మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే మహీ నిర్ణయాలు ఈసారి కోహ్లీసేనకు ఉపయోగపడతాయని భావిస్తోంది బోర్డు. మరి మార్గనిర్దేశకుడిగా ధోనీ ఎంతవరకు సక్సెస్ అవుతాడో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ధోనీ సాధించిన మరిన్ని విజయాలు
వన్డేల్లో అత్యధిక నాటౌట్లున్న ఆటగాడిగా రికార్డు.
ఏడో స్థానంలో దిగి రెండు సెంచరీలు చేసిన ఘనత ఇతడిదే.
సిక్సర్లు కొట్టి 9 వన్డేలను గెలిపించిన ఏకైక కెప్టెన్ ధోనీనే.
అంతర్జాతీయంగా అత్యధిక స్టంపింగులు చేసిన రికార్డు ధోనీదే. ఇందులో టెస్టు(38), వన్డే(120), టీ20(34) ఉన్నాయి.