Yuzvendra Chahal Dhanashree Verma: ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 15వ సీజన్లో అదరగొట్టాడు టీమ్ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన అతడు.. అత్యధిక వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్‌ను కూడా అందుకున్నాడు. అయితే చాహల్.. ఏడాదిన్నర క్రితం తన ప్రేయసి ధనశ్రీ వర్మను వివాహం చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. సామాజిక మాధ్యమాల్లో రీల్స్‌తో చేసే సందడి అంతా ఇంతా కాదు. ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ నవ్వుతూ సంతోషంగా ఉంటారు. తాజాగా ధనశ్రీ రాజస్థాన్ రాయల్స్ పాడ్‌కాస్ట్‌లో.. చాహల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
![Yuzvendra Chahal Dhanashree Verma](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15497414_epe.jpg)
"యుజీ ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. నిజం చెప్పాలంటే అతడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. క్రికెట్‌ను పిచ్చిపిచ్చిగా ప్రేమిస్తాడు. అతడి ఫస్ట్ లవ్ కూడా అదే. అందుకే అతడు ఎప్పుడూ అందంగా నవ్వుతూ ఉంటాడు. చాహల్ ఎక్కడుంటే అక్కడ నవ్వులే. తన తోటి వాళ్లతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. సాధారణంగా డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం కొంచెం ఒత్తిడికి గురిచేస్తుంది. ఆ సమయంలోనూ యుజీ తన ముఖంపై చిరునవ్వు చెదరనివ్వడు." అని చాహల్ భార్య ధనశ్రీ తెలిపింది.
![Yuzvendra Chahal Dhanashree Verma](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15497414_tkdk.jpg)
అయితే తాను మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటానని.. భావోద్వేగాలను అదుపు చేసుకోలేనని తెలిపింది ధనశ్రీ. అందుకే మ్యాచులు చూసేటప్పుడు బిగ్గరగా అరవడం.. ఓవర్‌గా ఎక్స్‌ప్రెస్ అవ్వడం వంటివి చేస్తుంటానని వెల్లడించింది. ఐపీఎల్ 2022 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన చాహల్.. 17 మ్యాచుల్లో 27 వికెట్లు తీశాడు. కోల్‌కతా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్‌తో పాటు ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు.
ఇవీ చదవండి: చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్.. బ్రాడ్‌మన్ తర్వాత అతడే.. భారత్‌లో టాప్!