ప్రపంచకప్‌లో టీమిండియా తొలి అడుగు ఘనంగా వేసింది. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రోహిత్‌శర్మ 122 పరుగులు( 144 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సులు) చేసి అదరగొట్టగా.. చాహల్ 4 వికెట్లు.. బుమ్రా, భువీ రెండేసి వికెట్లు తీసి బంతితో మాయ చేశారు. ఫలితంగా 15 బంతులు మిగిలి ఉండగానే 228 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది కోహ్లీసేన. జూన్ 9న ఆస్ట్రేలియాతో జరగబోయే తర్వాతి మ్యాచ్ అంత తేలికగా ఉండదని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ అభిప్రాయపడ్డారు.
"దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో గెలిచిన ఆత్మవిశ్వాసంతో టీమిండియా తదుపరి మ్యాచ్‌కి సన్నద్ధమవ్వాలి. ప్రస్తుతమున్న ఆసీస్ జట్టు బలమైన ప్రత్యర్థి. ఓవల్ వేదికగా భారత్- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా జరగనుంది. ఈ పిచ్ ఎక్కువగా బౌన్స్ అవుతుంది. అది ఆసీస్ బౌలర్లకు ప్రయోజనం. అయితే భారత బ్యాట్స్మెన్లు కంగారూ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొంటారు".
-- సచిన్ తెందుల్కర్, మాజీ క్రికెటర్
'డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ తిరిగి జట్టులో చేరడం ఆస్ట్రేలియాకు మరింత బలంగా మారింది. ముఖ్యంగా వార్నర్ ఐపీఎల్‌లో అద్భుతంగా ఆడాడు.' అని సచిన్ పేర్కొన్నారు.
ఆదివారం జరిగే మ్యాచ్ గురించి కోహ్లీ బృందానికి సచిన్ పలు సూచనలు చేశారు. ఒకవేళ ఆసీస్ బౌలింగ్ ధాటికి ఆరంభంలో వెంటవెంటనే వికెట్లు కోల్పోయినా.. దాని గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఇంగ్లాండ్‌లో బౌన్సీ పిచ్‌లు కాబట్టి వికెట్లు పడినంత మాత్రాన టీమిండియా ఆందోళన పడాల్సిన అవసరం లేదని సూచించారు. వాళ్లు మనల్ని ఇబ్బంది పెట్టినా.. మన బౌలర్లు వారినీ అడ్డుకుంటారని భరోసా ఇచ్చారు.