రెండేళ్ల క్రితం ఇంగ్లాండ్ గడ్డపై అనూహ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన పాకిస్థాన్ అదే జోరు కొనసాగించాలనుకుంటోంది. విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌తో బరిలో దిగుతున్న విండీస్ జట్టు మంచి ఫామ్‌లో ఉంది. ఈ రెండు జట్ల మధ్య ట్రెంట్‌బ్రిడ్జ్ నాటింగ్‌హామ్ వేదికగా నేడు ప్రపంచకప్ మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఆట ప్రారంభం కానుంది.
పాక్.. అనిశ్చితికి మారుపేరు
ప్రపంచకప్ టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిసారి బౌలింగే ప్రధానాయుధంగా బరిలో దిగుతూ వస్తున్న పాకిస్థాన్ తొలిసారి బలమైన బ్యాటింగ్ లైనప్‌తో మెగాటోర్నీకి సిద్ధమైంది. ఇంగ్లాండ్ టూర్‌లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడిన బ్యాట్స్‌మెన్ మంచి ఫామ్‌లో ఉండటం పాక్‌కు కలిసొచ్చే అంశం.
ఓపెనర్లు ఇమాముల్ హక్, ఫకార్ జమాన్... భీకరమైన ఫామ్‌లో ఉంటే.. బాబర్ ఆజమ్, కెప్టెన్ సర్ఫరాజ్ నిలకడగా రాణిస్తున్నారు. మిడిలార్డర్‌లో షోయబ్ మాలిక్, హఫీజ్ ఇన్నింగ్స్‌కు స్థిరత్వం చేకూర్చుతున్నారు. వరల్డ్‌కప్ జరుగనున్న వేదికలపై వన్డే సిరీస్ ఆడిన అనుభవం, అక్కడి పిచ్‌లు, పరిస్థితులపై అవగాహన సర్ఫరాజ్ సేనకు అనుకూలం.
రెండేళ్ల కిందట ఇంగ్లాండ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని గెలుపొందడం సహా.. 1992 లో చివరిసారిగా రౌండ్‌రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన వరల్డ్‌కప్ కైవసం చేసుకోవడం కూడా దాయాది దేశం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది.
ప్రపంచకప్ ముందు ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 5-0 తేడాతో కోల్పోయింది పాక్. అంతకుముందు ఆస్ట్రేలియాపై 4-0 తేడాతో పరాజయం చెందింది. అంతేకాకుండా వార్మప్ మ్యాచ్‌లో పసికూన అప్ఘానిస్థాన్ చేతిలో ఓటమి చవిచూసింది. వీటన్నింటినీ పక్కనపెట్టి విండీస్‌తో మ్యాచ్‌లో సత్తాచాటాలని చూస్తోంది.
గతమెంతో ఘనమైన విండీస్
గతమెంతో.. ఘనకీర్తి కలిగిన వెస్టిండీస్‌కు భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ తొలి రెండు ప్రపంచకప్‌లను చేజిక్కించుకున్న కరీబియన్ జట్టు ఆ తర్వాత పేలవ ప్రదర్శనతో పతనమవుతూ వచ్చింది. 1983 ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోయాక 1996 ప్రపంచకప్‌లో మాత్రమే సెమీఫైనల్ దాకా వెళ్లిన విండీస్ 2015 నుంచి 78 వన్డే మ్యాచ్‌లు ఆడి కేవలం 23 మ్యాచ్‌లే గెలిచింది.
అప్ఘానిస్తాన్, జింబాబ్వే, ఐర్లాండ్ లాంటి చిన్నజట్లకూ తలవంచింది. గత రెండు దశాబ్దాల కాలంలో విశ్వసమరంలో ఉనికే లేని వెస్టిండీస్ ఈ సారి ప్రపంచకప్‌నకు క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా అర్హత సాధించింది. ప్రపంచకప్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు ఆడిన వెస్టిండీస్ 42 విజయాలు సాధించింది. పాక్‌తో జరిగే ఆరంభపోరులో గెలుపొంది వరల్డ్ కప్ వేటను విజయంతో ఆరంభించాలని భావిస్తోంది.
ప్రపంచకప్ టోర్నీల్లో పాకిస్థాన్ - విండీస్ జట్లు ముఖాముఖి 10 సార్లు తలపడగా... మూడు సార్లు మాత్రమే పాక్ గెలిచింది.
పాకిస్థాన్‌పై జరిగిన వార్మప్ మ్యాచ్‌లో రసెల్ 13 బంతుల్లో 42, కివీస్‌పై 25 బంతుల్లో 54 పరుగులు చేసి ప్రపంచకప్ ముందే తన విధ్వంసంపై సంకేతాలిచ్చాడు. క్రిస్ గేల్, ఆల్‌రౌండర్ బ్రాత్‌వైట్ లాంటి ప్రమాదకర ఆటగాళ్లు విండీస్ జట్టులో ఉన్నారు.