లండన్ కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ సత్తాచాటుతున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లీషు జట్టులో జాసన్ రాయ్(54), జోయ్ రూట్(51) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. అనుకున్నట్టుగానే బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఇద్దరూ దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డారు.
తొలి బంతికే వికెట్..
ప్రపంచకప్ 12వ సీజన్లో తొలి బంతికే వికెట్ సమర్పించుకుంది ఇంగ్లాండ్. ప్రొటీస్ బౌలర్ ఇమ్రాన్ తాహిర్ వేసిన తొలి ఓవర్ మొదటి బంతికే బెయిర్ స్టో ఔటయ్యాడు. కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ పరిస్థితుల్లో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు రూట్, జాసన్ రాయ్.
వీరిరువురు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు భారీ స్కోరు అందించే దిశగా దూసుకెళ్లారు. ఆరంభంలో నిదానంగా ఆడినా.. తర్వాత ఇద్దరూ బ్యాట్‌కు పనిచెప్పారు. 51 బంతుల్లో రాయ్ అర్ధశతకం సాధించగా... 57 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు రూట్. 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జాసన్ రాయ్.. ఫెహ్లూక్వాయో బౌలింగ్‌లో వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్లోనే రబాడా బౌలింగ్‌లో రూట్ కూడా ఔట్ అయ్యాడు.