ప్రపంచకప్‌పై ఎక్కువగా అంచనాలు పెట్టుకోవద్దని బంగ్లాదేశ్ కెప్టెన్ మష్రఫే మొర్తజా అభిమానులను కోరాడు. ప్రారంభంలోనే పెద్ద పెద్ద జట్లతో తలపడనున్నామని, సానుకూల ఫలితాలు రాకపోవచ్చని చెప్పాడు. మెగాటోర్నీ కోసం ఇవాళ ఇంగ్లాండ్ పయనమౌతోంది బంగ్లాదేశ్ జట్టు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు మొర్తజా.
"వరల్డ్‌కప్ ప్రారంభంలోనే బలమైన జట్లతో ఆడనున్నాం. సానుకూల ఫలితాలు రాకపోవచ్చు. గత కొన్నేళ్ల నుంచి ప్రేక్షకులు మాపై ఎక్కువ అంచనాలతో మ్యాచ్‌లు చూస్తున్నారు. ఇలాంటి టోర్నీల్లో విభిన్నంగా ముందుకెళ్లాలి." -మష్రఫే మొర్తజా , బంగ్లాదేశ్ కెప్టెన్.
ఈ నెల 30న ఇంగ్లాండ్, వేల్స్ వేదికగా జరిగే మెగాటోర్నీలో బంగ్లా తన మొదటి మూడు మ్యాచ్‌లు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లతో ఆడనుంది. ఇటీవల జరగిన ఐర్లాండ్, వెస్టీండిస్ త్రైపాక్షిక సిరీస్‌లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌లో తమ జట్టు సత్తాచాటాలని బంగ్లా అభిమానులు ఆశిస్తున్నారు.
2015 ప్రపంచకప్ తొలిసారి క్వార్టర్స్‌కు చేరిన బంగ్లాదేశ్.. ఈ సారి అంతకంటే అత్యుత్తమ ప్రదర్శన చేయాలని భావిస్తోంది.