మష్రఫీ మొర్తజా సారథ్యంలోని బంగ్లా జట్టు ప్రపంచకప్‌లో 8వ స్థానంలో నిలిచింది. 9 మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు 3 విజయాలు సహా ఓ ఆట రద్దు వల్ల 7 పాయింట్లు సాధించింది. మెగాటోర్నీలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్ జట్లు మాత్రమే ఓడించి లీగ్ దశలోనే నిష్క్రమించింది. ప్రపంచకప్‌లో ప్రదర్శనపై విశ్లేషణ చేసుకున్న బంగ్లా క్రికెట్ బోర్డు(బీసీబీ)... ప్రధాన కోచ్ స్టీవ్ రోడ్స్‌పై వేటు వేసింది. అతడిని శిక్షకుడి బాధ్యతల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
"పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో బంగ్లా ఓటమి తర్వాత ప్రదర్శనపై విశ్లేషణ చేసుకున్నాం. అందులో భాగంగానే స్టీవ్ రోడ్స్‌ను కోచ్ బాధ్యతల నుంచి తప్పిస్తున్నాం. బీసీబీ అతడితో చేసుకున్న ఒప్పందాన్ని పొడిగించాలనుకోవట్లేదు. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. శ్రీలంకతో త్వరలో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. కొత్త కోచ్ నియామకంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ".
--నిజాముద్దీన్ చౌదరి, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సీఈఓ
రోడ్స్ 2018లో బంగ్లా క్రికెట్ జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల కాలానికి బోర్డుతో అంగీకారం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం వచ్చే ఏడాదికి ముగియనుండగా.. బీసీబీ, రోడ్స్ పరస్పర అంగీకారంతోనే మధ్యలోనే బ్రేక్ పడింది.
బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ మినహా ఒక్కరూ ఆశించిన స్థాయిలో ఆడలేదు. షకిబ్ మాత్రం టోర్నీ మొత్తం అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించాడు. 606 పరుగులు, 11 వికెట్లతో ఆల్‌రౌండర్‌గా రాణించాడు. బంగ్లా జట్టు వచ్చే నెల నుంచి శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది.
బంగ్లా బౌలింగ్ కోచ్‌లు వాల్ష్, సునీల్ జోషి, ఫిజియో చంద్రమోహన్ కాంట్రాక్టులను రద్దు చేసే యోచనలో ఉంది బీసీబీ.