భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పండుగే కాదు... ఐసీసీకి అత్యంత ఆదాయాన్ని తెచ్చిపెట్టే మ్యాచ్ కూడా. టోర్నీ ఏదైనా, వేదిక ఎక్కడైనా ఈ హోరాహోరీ పోరుకు అభిమానుల తాకిడి ఎప్పుడూ తగ్గదు. ఇరుదేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ అత్యంత భావోద్వేగాలతో కూడుకున్నది కావడమే ఇందుకు కారణం. అయితే ఇదే అంశం ఇప్పుడు టికెట్ అమ్మకందారులను అత్యాశలో ముంచెత్తుతోంది. సాధారణ టికెట్ ధరలకంటే ఊహించని విధంగా రేట్లను పెంచేసి అభిమానుల నుంచి భారీగా దండుకుంటున్నాయి టికెట్లను విక్రయించే కొన్ని సంస్థలు. తాజాగా మాంచెస్టర్‌లో జరగనున్న మ్యాచ్ నేపథ్యంలో ఇలాంటి దృశ్యమే ఎదురైంది. ఒక్కో టికెట్‌ను ఏకంగా రూ.4 లక్షలకు పైగానే విక్రయించింది వయాగోగో సంస్థ.
భారత్-పాక్ ప్రపంచకప్ మ్యాచ్ టికెట్లన్నీ అమ్ముడైపోయాయని ఐసీసీ కొద్ది నెలల క్రితమే ప్రకటించింది. వీటిలో రెండొంతుల మూడుభాగాల టికెట్లు భారత అభిమానులే కొనుగోలు చేశారని.. పాక్ అభిమానులు కేవలం 18 శాతం టికెట్లు మాత్రం కొన్నారని తెలిపింది.
అయితే తమ టికెట్లను రద్దు చేసి రీసేల్(మలి అమ్మకాలు) జరపాలని 480 మంది అభిమానులు ఐసీసీకి అభ్యర్థించారు. ఫలితంగా ఈ టికెట్లను అమ్మకాల్లో ఉంచాలని నిర్ణయించింది ఐసీసీ. ఇదే అదునుగా వయాగోగో వెబ్సైట్ నిబంధనలు పట్టించుకోకుండా టికెట్ రేట్లను తమకు ఇష్టమొచ్చినట్లు పెంచేసింది. మ్యాచ్‌కు వారం రోజుల ముందు అమ్మకాలు జరిపిన ఈ సంస్థ... గోల్డ్ లెవల్లో ఒక్కో టికెట్ ధర ఏకంగా రూ. 4 లక్షలకు పైనే విక్రయించింది.
కొన్ని నెలల ముందు సాధారణంగా జరిపిన అమ్మకాల్లో అత్యంత ఖరీదైన అడల్ట్ ప్లాటినమ్ టికెట్ విలువ 300 డాలర్లు (దాదాపు రూ. 20,964). ఐతే మ్యాచ్‌కు వారం ముందు వయాగోగో వెబ్సైట్ ద్వారా చేపట్టిన అమ్మకాల్లో ప్లాటినమ్ కంటే తక్కువైన గోల్డ్ లెవల్ టికెట్ ధరే ఏకంగా 6 వేల డాలర్లు(దాదాపు రూ. 4,20,000) పలికింది.