ఆస్ట్రేలియా ప్రముఖ టీ20 టోర్నమెంట్ బిగ్ బిష్ లీగ్‌లో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆడబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే యువీతో పలు ఫ్రాంచైజీ అధికారులు చర్చించినట్లు సమాచారం. యువరాజ్ మేనేజర్ దీనిపై స్పష్టత ఇచ్చినట్లు ఆసీస్‌కు చెందికి ఓ పత్రిక రాసుకొచ్చింది. యువీని ఈ లీగ్ ఆడించేందుకు ఓ ఫ్రాంచైజీ ప్రయత్నిస్తోందని అతడు తెలిపాడు.
భారత ఆటగాళ్లు విదేశీ లీగ్‌ల్లో ఆడాలంటే బీసీసీఐ వారికి అనుమతి పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అది జరగని పని. ఇప్పటికే కొంత మంది ఆటగాళ్లు ఈ విషయమై బోర్డుకు విన్నవించారు. జట్టుకు చాలా కాలంగా దూరంగా ఉంటున్న వారికైనా అనుమతి ఇవ్వాలని కోరారు.
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ కూడా ఇదే విషయమై స్పందించాడు. "భారత ఆటగాళ్లకు విదేశీ టీ20ల్లో పాల్గొనేందుకు అనుమతి లభించదని తెలుసు. ఇదే వారికి పెద్ద సమస్య. ఇండియాలో చాలామంది ప్రపంచస్థాయి టీ20 ప్లేయర్లు ఉన్నారు. ఒకవేళ భారత ఆటగాళ్లు బిగ్‌బాష్ లీగ్‌లో పాల్గొంటే అంతకుమించిన ఆనందం ఉండదు. వారి ద్వారా టోర్నీకి మరింత అందం వస్తుంది" అని అన్నాడు.
యువరాజ్ సింగ్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో అతడు విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. అతడు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కెనడాలో జరిగిన గ్లోబల్ టీ20 టోర్నీలో పాల్గొన్నాడు.