టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఫౌండేషన్‌కు ఒకప్పుడు భారీ విరాళం ప్రకటించినట్లు పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది పేర్కొన్నాడని పాక్ జర్నలిస్టు సజ్ సాదిక్ ట్వీట్ చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఇటీవల పాకిస్థాన్‌లోని పేదలకు అఫ్రిది సహాయం చేశాడు. ఈ సందర్భంగా అతడు చేసిన మంచి పనిని భారత క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ ప్రశంసించారు. దీంతో వీరిద్దరిపై మండిపడుతూ, కొందరు నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. అందుకు స్పందించిన వీరిద్దరూ, వారికి గట్టి సమాధానమిచ్చారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మతం, రాజకీయాల కన్నా మానవత్వమే ముఖ్యమని చెప్పారు. ఈ నేపథ్యంలో పాక్ జర్నలిస్టు చేసిన ట్వీట్ వార్తల్లో నిలిచింది.
అఫ్రిది కెనడాలో ఉన్నప్పుడు యువరాజ్ సింగ్ ఫౌండేషన్‌కు పదివేల డాలర్ల విరాళం ప్రకటించానని, అప్పుడు పాకిస్థాన్‌లోని ప్రతి ఒక్కరూ తనను అభినందించారని పాక్ క్రికెటర్ చెప్పాడు. భారత్‌కు ఎందుకు సహాయం చేస్తున్నావని ఆ సమయంలో తననెవరూ ప్రశ్నించలేదని అఫ్రిది చెప్పినట్లు సాదిక్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.
ఇదీ చూడండి : లాక్డౌన్ పెంపుతో ఐపీఎల్ మళ్లీ వాయిదా!