ఇటీవలే రిటైర్మెంట్ తీసుకున్న భారత క్రికెటర్ యువరాజ్ సింగ్.. విదేశీ టోర్నీల్లో ఆడేందుకు అనుమతివ్వాలంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి లేఖ రాశాడు. వినోదాన్ని ఆస్వాదించేందుకే ఈ లీగ్‌ల్లో ఆడుతున్నానని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
"నేను విదేశాల్లో జరిగే టీ20 క్రికెట్లో పాల్గొనాలనుకుంటున్నా. నా వయసు దృష్ట్యా ఆనందం కోసమే క్రికెట్ ఆడాలనుకుంటున్నా. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ ఆడటమనేది ఒత్తిడితో కూడుకున్నది" -యువరాజ్ సింగ్, క్రికెటర్
విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకు గత వారమే యువరాజ్.. బీసీసీఐ అనుమతి కోరాడు. కానీ.. అప్పటికి అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించని కారణంగా ఆ విషయాన్ని తిరస్కరించింది బోర్డు.
"మంగళవారం యువరాజ్.. బోర్డుకు లేఖ రాశాడు. ఇందులో చిక్కొచ్చే విషయమేమి కనిపించడం లేదు. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ నుంచి యువరాజ్ రిటైర్మెంట్ ప్రకటించాడు." -బీసీసీఐ అధికారి
ప్రస్తుతం అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్.. యూఏఈలో జరిగే టీ10 లీగ్‌ల్లో ఆడుతున్నారు.
కరీబియన్ లీగ్‌లో పాల్గొనేందుకు తన పేరిచ్చిన ఇర్ఫాన్ పఠాన్.. విదేశీ లీగ్‌లో ఆడనున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. కానీ బీసీసీఐ అనుమతి అతడింకా తీసుకోలేదు.
ఇది చదవండి: సిక్సర్ల 'యువరాజు' భావోద్వేగ వీడ్కోలు