భారత ఆల్‌రౌండర్ క్రికెటర్, సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ముంబయిలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా కార్యక్రమంలో ఈ విషయాన్ని తెలిపాడు యువీ. రిటైర్మెంట్కు ఇదే సరైన సమయమని పేర్కొన్నాడు. భారత జట్టు తరఫున 400 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహిస్తానని తాను ఎప్పుడూ ఊహించలేదన్నాడు యువీ.
తన జీవితంలో విజయాల కంటే వైఫల్యాలే ఎక్కువన్నాడు యువరాజ్. అయినా ఏనాడు ఆత్మవిశ్వాసం కోల్పోలేదని తెలిపాడు. తన జీవితంలో చివరి శ్వాస వరకు ఇదే తరహాలో ముందుకు సాగుతానని పేర్కొన్నాడు. ఒడుదొడుకులు ఎలా ఎదుర్కొవాలో క్రికెటే తనకు నేర్పించిందన్నాడు. క్రికెట్ కోసం తన శక్తినంతా ధారపోశానని చెప్పాడు యువీ.
"సిడ్నీలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో చివరి ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టడం నాలో విశ్వాసాన్ని తిరిగి తెచ్చింది. క్రికెట్ నాకు గొప్ప స్నేహితులను, సీనియర్లను ఇచ్చింది. సౌరవ్ గంగూలీ సారథ్యంలో నా అంతర్జాతీయ క్రికెట్ జీవితం ప్రారంభమైంది. నా ఆరాధ్య క్రికెటర్ సచిన్ తెందూల్కర్‌తో ఆడే అవకాశం దక్కింది. నాతో పాటు టీం ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన నా సన్నిహిత మిత్రులు జహీర్ ఖాన్, సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, నెహ్రా, బజ్జీ భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇదే బృందంతో ధోనీ సారథ్యంలో గ్యారీ కిర్‌స్టెన్ శిక్షణలో టీమిండియా 2011లో వరల్డ్‌కప్ గెలుపొంది చరిత్ర సృషించింది. నాతో పనిచేసిన కోచ్‌లలో కిర్‌స్టెన్ అత్యుత్తమం. 2000సం.లో నన్ను భారత జట్టుకు ఎంపిక చేసిన గంగూలీకి ప్రత్యేక కృతజ్ఞతలు.
చివరగా, ముఖ్యంగా నా ప్రధాన బలం మా అమ్మకు ధన్యవాదాలు. నాకు రెండు సార్లు జన్మనిచ్చిన అనుభూతినిచ్చింది. కఠిన సమయాల్లో నాకు తోడుగా ఉన్న నా భార్యకు కృతజ్ఞతలు. నన్ను ఇష్టపడే నా సన్నిహిత మిత్రులందరికీ ధన్యవాదాలు."
-యువరాజ్ సింగ్.
ధోనీ సారథ్యంలో టీమిండియా 2007లో టీ-20, 2011లలో వన్డే ప్రపంచకప్‌లు సాధించడంలో యువీ కీలక పాత్ర పోషించాడు.
టీ-20 వరల్డ్‌కప్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు
తొలిసారి 2007లో ప్రారంభమైన టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్ తనదైన ముద్ర వేశాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఏకంగా ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టి క్రికెట్ ప్రపంచాన్ని మొత్తం తనవైపు తిప్పుకున్నాడు. ఆ మ్యాచ్‌లో కేవలం 12 బంతుల్లోనే అర్ధశతకం సాధించి చరిత్ర నెలకొల్పాడు. ఆ టోర్నమెంట్లో బౌలర్ల పాలిట సింహస్వప్నమయ్యాడు యువరాజ్.
2011 వరల్డ్‌కప్‌లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్
2011 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యువీ.. టీమిండియా రెండోసారి వన్డే ప్రపంచకప్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడి 362 పరుగులు చేసి 15 వికెట్లూ తీసి సత్తా చాటాడు. ఈ ప్రదర్శనతో యువీ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. అయితే అదే సమయంలో క్యాన్సర్‌తో పోరాడినా ఎవరికీ చెప్పలేదు. ప్రపంచకప్ తర్వాత విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకున్నాడు. పూర్తిగా కోలుకున్న యువీ.. ఎంతో మంది క్యాన్సర్ బాధితులకు ఆదర్శంగా నిలిచాడు.
భారత్ తరఫున 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ-20 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 1900 పరుగులు, వన్డేల్లో 8701 పరుగులతో పాటు 111 వికెట్లు పడగొట్టాడు.
అవార్డులు
2012లో భారత ప్రభుత్వం క్రీడల్లో రెండో అత్యున్నత పురస్కారమైన అర్జున అవార్డు, 2014లో పద్మశ్రీతో సత్కరించింది.
ఇదీ చూడండి: దక్షిణాఫ్రికా - విండీస్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం