మరో 13 రోజుల్లో ఐపీఎల్ సందడి ప్రారంభం కానుంది. క్రికెటర్లంతా తొలిసారి బయోసెక్యూర్ వాతావరణంలో మ్యాచ్‌లు ఆడనున్నారు. ఈ క్రమంలోనే బయో బబుల్‌లో ఉన్నప్పుడు ఆటగాళ్లంతా మానసికంగా దృఢంగా ఉండాలని దిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డాడు. బబుల్ ఛాలెంజ్‌ను స్వీకరించడం ఏమంత కష్టం కాదని చెప్పాడు.
"బుడగలో ఉన్నప్పుడు కొన్ని సవాళ్లు ఎదుర్కోవాలి. కొత్త వ్యక్తులను కలవలేరు. మా బృందానికైతే వినోద గది ఏర్పాటు చేసుకున్నాం. ఫ్రాంచైజీ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటోంది. మేమంతా ఒక కుటుంబంలా కలిసిపోయాం. పరిస్థితిని ఏ విధంగా చూస్తామనే దానిపైనే మన ప్రదర్శన ఆధారపడి ఉంటుంది."
శిఖర్ ధావన్, క్రికెటర్
జట్టు సభ్యులతో కలవడానికి తనకు ఇదొక మంచి అవకాశమని శిఖర్ పేర్కొన్నాడు. మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్.. కరోనా కారణంగా నిరవధిక వాయిదా పడింది. అనంతరం సెప్టెంబరు 19న లీగ్ జరగనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. యూఏఈ వేదికగా నవంబరు 10 వరకు టోర్నీ నిర్వహించనున్నారు. కాగా ఆదివారం ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటించింది పాలకమండలి. తొలి మ్యాచ్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది.