టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీని మించిన మరో నాయకుడు, సీఎస్‌కే కంటే గొప్ప జట్టు ఏదీ లేదని భారత సీనియర్ లెగ్‌స్పిన్నర్ పియూష్ చావ్లా అన్నాడు.
"ఏ ఆటగాడైనా గొప్ప సారథి నాయకత్వంలో మంచి జట్టులో ఆడాలని కోరుకుంటాడు. సీఎస్‌కే కంటే గొప్ప జట్టు, ధోనీని మించిన మరో నాయకుడు ఎవరూ ఉండరు. ఇంతకంటే నేను ఎక్కువ ఆశించను. కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఆలోచనలు వేరు. వాటి గురించి నాకు ముందే తెలియజేశారు. ఈడెన్‌గార్డెన్స్ పిచ్ స్పిన్నర్లకు అంతగా అనుకూలించదు. దీంతో వారు పేసర్లపై దృష్టి సారించారు. జట్టులో ముగ్గురు నాణ్యమైన స్పిన్నర్లు అవసరం లేదని భావించారు. అందుకే నన్ను వదిలిపెట్టారు. మా మధ్య సంబంధాలు ఆరోగ్యకరంగానే ఉన్నాయి. ఎలాంటి విభేదాలు లేవు" -పియూష్ చావ్లా, లెగ్ స్పిన్నర్
కోల్‌కతాలో గురువారం జరిగిన ఐపీఎల్ వేలంలో చావ్లాను సీఎస్‌కే రూ.6.75 కోట్ల భారీ మొత్తం వెచ్చించి కొనుక్కుంది. ఈ వేలంలో భారత క్రికెటర్లలో అత్యధిక ధరకు అమ్ముడిపోయిన ఆటగాడిగా పియూష్ నిలిచాడు. గతంలో రూ.4.2 కోట్లకు అతడిని కొన్న కోల్‌కతా ఈసారి వదిలేయడం వల్ల చావ్లా వేలానికొచ్చాడు. అతడితో పాటు సామ్ కరన్(రూ.5.5 కోట్లు), హేజిల్‌వుడ్ (రూ.2 కోట్లు)ను చెన్నై తీసుకుంది.
ఇది చదవండి: ఐపీఎల్ 2020: 8 ఫ్రాంఛైజీల కొత్త జాబితా ఇదే.