న్యూజిలాండ్‌తో టెస్టులకు తనను కాదని, యువ వికెట్‌కీపర్ రిషభ్‌పంత్‌ను తుదిజట్టులోకి తీసుకోవడంపై సీనియర్ కీపర్ వృద్ధిమాన్ సాహా నోరు విప్పాడు. తాజాగా ముగిసిన రంజీ ఫైనల్లో సౌరాష్ట్ర చేతిలో బంగాల్ జట్టు ఓడిపోవడం గురించి స్పందించాడు.
"న్యూజిలాండ్‌తో టెస్టులు ఆడినప్పుడు ఎర్రబంతితో సాధన చేశాను. ఒకవేళ బంగాల్ రంజీ ఫైనల్‌కు అర్హత సాధిస్తే అక్కడ ఆడదామని అనుకున్నాను. జట్టు సభ్యులందరూ తెల్ల బంతితో సాధన చేస్తే, నేను మాత్రం ఎర్రబంతితో చేశాను. బంగాల్‌తో కలిశాక జట్టులో మంచి వాతావరణం ఏర్పడింది. అయితే ఫైనల్లో మాత్రం మేం అనుకున్నట్లు జరగలేదు. ఇప్పుడు సాకులు చెప్పడం సరికాదు. ఏం జరిగినా మేం మంచి ప్రదర్శన చేయాల్సింది. తొలుత కీలకమైన టాస్ ఓడిపోయాం. మ్యాచ్ జరిగేటప్పుడు అన్ని విభాగాల్లో కాస్త వెనుకబడ్డాం"
- వృద్ధిమాన్ సాహా, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్
అలాగే కివీస్‌తో టెస్టు సిరీస్‌లో తనను తుదిజట్టులోకి తీసుకోకపోవడంపైనా స్పందించాడు. సహజంగా ఏ క్రికెటర్‌కైనా మ్యాచ్‌కు ముందు తుదిజట్టు గురించి తెలుస్తుందని, తన విషయంలోనూ అలాగే జరిగిందన్నాడు. జట్టు యాజమాన్య నిర్ణయాలను బట్టి మెలగాల్సి ఉంటుందని, గత సిరీస్ ఆడినందున ఇప్పుడూ ఆడతామనే భావన మనసులో ఉంటుందని సాహా చెప్పాడు. సొంత ప్రయోజనాల కంటే జట్టు అవసరాలకే తాను ప్రాధాన్యమిస్తానని అన్నాడు. ఒకవేళ పంత్‌ను ఆడించాలనుకుంటే తనకెలాంటి అభ్యంతరం లేదని, జట్టు విజయం సాధిస్తే చాలని పేర్కొన్నాడు.
ఇదీ చూడండి.. రిటైర్ అయ్యేలోపు అన్ని సెంచరీలు చేస్తా: గేల్