ప్రపంచకప్ సమరానికి అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. మొత్తం 10 జట్లు సత్తా చాటేందుకు ఊవిళ్లూరుతున్నాయి. కొంత కాలంగా వరుస ఓటములతో ఇబ్బందిపడుతోన్న శ్రీలంక జట్టు మెగాటోర్నీలో ఎలా ఆడుతుందనేది ఆసక్తికరం. 1996లో టైటిల్ గెలిచిన ఈ జట్టు బలాబలాలను ఓ సారి పరిశీలిద్దాం.
ప్రస్తుతమున్న శ్రీలంక జట్టును చూస్తుంటే చాలా బలహీనంగా కనిపిస్తోంది. శ్రీలంకకు కూడా తనపై తనకు పెద్దగా అంచనాలేమీ ఉండకపోవచ్చు. దిగ్గజ ఆటగాళ్ల రిటైర్మెంట్‌తో బలం కోల్పోయిన లంక.. క్రికెట్ బోర్డులో రాజకీయాలు, అవినీతి కారణంగా మరింత దయనీయ పరిస్థితికి చేరుకుంది.
చివరిసారి 2015 ప్రపంచకప్ సందర్భంగా వన్డే మ్యాచ్ ఆడిన కరుణరత్నె.. ఈ ప్రపంచకప్‌లో ఆ జట్టు సారథిగా వ్యవహరించనున్నాడు. కొన్నేళ్ల నుంచి విజయమంటూ ఎరగని లంక.. గతేడాది ఆసియా కప్‌లో పసికూన అఫ్గానిస్థాన్ చేతిలో 91 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. 2015 నుంచి 98 వన్డే మ్యాచ్‌లు ఆడిన లంక కేవలం 29 మ్యాచ్‌లే గెలిచింది. 62 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. దాదాపు మూడేళ్లుగా వన్డే సిరీసే నెగ్గలేదు.
1975 ప్రపంచకప్‌లో అరంగేట్రం చేసిన లంక జట్టు 1996లో ట్రోఫీని గెలుచుకుంది. 2007, 2011లో రన్నరప్‌గా నిలిచింది. మొత్తంగా ప్రపంచకప్‌లలో 73 మ్యాచ్‌లు ఆడి 35 గెలిచింది. 35 ఓడింది. 3 మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు.
బలాలు
మాథ్యూస్ అనుభవం జట్టుకు కలిసొచ్చే అంశం. వన్డేల్లో అతడికి 42కు పైగా సగటు ఉంది. పేసర్ లసిత్ మలింగ కీలకం కానున్నాడు. బౌలింగ్‌లో ఒకప్పటిలా పదును లేదు. ఎక్కువగా మలింగపైనే ఆధారపడుతోంది. లక్మల్, తిసార పెరీరా రూపంలో మరో ఇద్దరు అనుభవజ్ఞులైన పేసర్లు లంకకు ఉన్నారు. బ్యాటింగ్‌లో మాథ్యూస్‌తో పాటు కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్ కీలక పాత్ర పోషించనున్నారు.
బలహీనతలు
కాగితంపై జట్టు కాస్త మెరుగ్గా కనిపిస్తున్నా.. ఇటీవల కాలంలోని పరాజయాలు శ్రీలంక ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. చాలా మంది ఆటగాళ్లు ఫామ్‌లో లేరు. ఒక్క మ్యాచ్ విన్నరూ కనిపించట్లేదు. ఫిట్‌నెస్ సమస్యలూ ఉన్నాయి. పేస్ విభాగం పర్వాలేదనిపించేలా ఉన్నా.. మిగతా జట్లతో పోలిస్తే అంత బలంగా కనిపించట్లేదు. లంక స్పిన్ విభాగం కూడా అంత ప్రభావవంతంగా లేదు. స్పిన్నర్లందరికీ కలిసి 100 వన్డేలు ఆడిన అనుభవం కూడా లేదు.
శ్రీలంక ప్రపంచకప్ జట్టు
కరుణరత్నె (కెప్టెన్), నువాన్ ప్రదీప్, సురంగ లక్మల్, మాథ్యూస్, జీవన్ మెండిస్, తిసార పెరీరా, లహిరు తిరిమానె, జెఫ్రీ వాండర్సే, ధనంజయ డిసిల్వా, అవిష్క ఫెర్నాండో, లసిత్ మలింగ, కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరా, మిలింద సిరివర్దన, ఇసురు ఉదాన.