టీ20 మహిళల ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా పరాజయం చెందింది. ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో సమష్టిగా విఫలమై రన్నరప్‌గా నిలిచింది. గ్రూప్ స్టేజీలో అద్భుత ప్రదర్శన చేసిన హర్మన్‌ప్రీత్ సేన తుదిపోరులో మాత్రం చతికిలపడింది. బౌలింగ్ వైఫల్యం, ఫీల్డర్ల తప్పిదాలు, బ్యాట్స్‌మెన్ విఫల ప్రదర్శన వెరసి తొలిసారి ట్రోఫీని ముద్దాడాలకున్న ఆశలపై నీళ్లు చల్లాయి. అయితే ముఖ్యంగా ఈ ఓటమికి నాలుగు ప్రధాన కారణాలున్నాయి.
హేలీ-మూనీ విజృంభణ
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు ఓపెనర్లు హేలీ, మూనీ శుభారంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌పై ఒత్తిడి పెంచారు. ఈ మ్యాచ్‌లో దూకుడే మంత్రంగా ఆడిన హేలీ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. బౌలర్లు కూడా వీరిని కట్టడి చేయడంలో విఫలమయ్యారు. వారిద్దరి బౌండరీలకు ఎవరి వద్ద సమాధానం లేకపోయింది. ఫలితంగా హర్మన్‌సేన ఆదిలోనే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయింది.
డ్రాప్ క్యాచ్‌లు
అలీసా హేలీ- బెత్ మూనీ ఇరువురికి మొదట్లోనే లైఫ్ వచ్చింది. దీప్తి శర్మ వేసిన తొలి ఓవర్ ఐదో బంతికే హేలీ ఔట్ కావాల్సింది. దీప్తి వేసిన ఫ్లాటెడ్ డెలివరినీ హేలీ కవర్స్‌లోకి బాదగా.. షెఫాలీ వర్మ క్యాచ్ మిస్ చేసింది. నాలుగో ఓవర్ మూడో బంతికి మరో లైఫ్ వచ్చింది. కానీ ఈసారి మూనీ బతికిపోయింది. రాజేశ్వరి గైక్వాడ్ వేసిన బంతిని మూనీ నేరుగా బౌలర్‌వైపు బాదగా కిందకు వచ్చిన ఈ క్యాచ్‌ను గైక్వాడ్ మిస్ చేసింది. ఫలితంగా ఇద్దరు ఓపెవర్లు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని భారత బౌలర్లపై ఆధిపత్యం వహించారు. హేలీ ఆకాశమే హద్దుగా చెలరేగి 39 బంతుల్లోనే 75 పరుగులు సాధించింది. ఇందులో 5 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయి. అలాగే మూనీ 54 బంతుల్లో 78 పరుగులు చేసింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 115 పరుగులు సాధించి టీమిండియాపై ఒత్తిడి పెంచారు.
షట్ వలలో షెఫాలీ
ఈ టోర్నీలో జరిగిన గ్రూపు మ్యాచ్‌ల్లో టీమిండియా ఓపెనర్ షెఫాలీ వర్మ అద్భుత ప్రదర్శన చేసింది. ఆద్యంతం దూకుడు ప్రదర్శించిన వర్మ ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగేది. కానీ ఫైనల్లో మాత్రం విఫలమైంది. దీనికి ఆసీస్ పక్కా ప్రణాళికే చేసింది. మేగన్ షట్ వేసిన మొదటి ఓవర్ మూడో బంతిని షెఫాలీ పాయింట్ వైపు ఆడబోగా అది కాస్తా బ్యాట్ ఎడ్జ్‌ను తీసుకుని కీపర్ చేతుల్లోకి వెళ్లింది. వికెట్ల వెనుక కాచుకుని చూస్తున్న హేలీ అద్భుతమైన క్యాచ్‌తో షెఫాలీని సాగనంపింది. 3 బంతుల్లో 2 పరుగులు చేసిన వర్మ క్రీజును వదిలివెళ్లడం ఇష్టం లేకనే పెవిలియన్ చేరింది.
హర్మన్-మంధాన వైఫల్యం
ఈ టోర్నీ మొదటి నుంచి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన ఫామ్ ఆందోళన కలిగించింది. ఫైనల్లో అయినా గాడిన పడతారు అనుకుంటే అదీ జరగలేదు. ముందటి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించిన మంధాన ఓ చెత్త షాట్ ఆడి ఔటైంది. సోఫియా వేసిన ఫ్లైటెడ్ డెలివరీని గాల్లోకి లేపింది. మిడాఫ్‌లో ఉన్న నికోల కారే ఎలాంటి తప్పిదం చేయకుండా బంతిని ఒడిసిపట్టుకుంది. ఫలితంగా 11 పరుగులు చేసిన మంధాన పెవిలియన్ చేరింది. అప్పటికే మూడు వికెట్లు పోగొట్టుకుని కష్టాల్లో ఉన్న భారత్‌కు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మరో షాకిచ్చింది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతుంది అనుకున్న అభిమానులకు నిరాశే మిగిల్చింది. జొనాసెన్ వేసిన బంతిని హర్మన్ స్వీప్ చేయబోగా బంతి గాల్లోకి లేచింది. ఫలితంగా 4 పరుగులు చేసిన కౌర్ వెనుదిరిగింది.