మైదానం వెలుపల ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌తో ఎంతటి స్నేహబంధం ఉన్నా.. అది ఆఫ్‌ఫీల్డ్‌కే పరిమితమని తెలిపాడు వెస్టిండీస్ సారథి జాసన్ హోల్డర్. ప్రత్యర్థి జట్టులోని ఆటగాడిలా మాత్రమే అతడిని పరిగణిస్తామని చెప్పాడు. ఇటీవల పేసర్ కీమర్ రోచ్ కూడా ఇదే విధంగా స్పందించాడు. జూన్ 8 నుంచి ఇంగ్లాండ్, వెస్డిండీస్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు కీమర్ రోచ్, జాసన్ హోల్డర్.
"మైదానం వెలుపల ఆర్చర్‌తో స్నేహం ఉన్నప్పటికీ, సిరీస్ ప్రారంభమైన తర్వాత ఆ పదానికి చోటివ్వం. ఇటీవల రోచ్ కూడా ఇదే విషయాన్ని మీకు చెప్పాడు. నేను అతని మాటలను సమర్థిస్తున్నా. ఎందుకంటే ఆర్చర్ కూడా మాతో ఇలానే ప్రవర్తిస్తాడు. "
-జాసన్ హోల్డర్, వెస్టిండీస్ సారథి.
ఇరువురి మధ్య జరగబోయే ద్వైపాక్షిక సిరీస్‌లో స్నేహానికి తావు లేదన్నాడు కీమర్ రోచ్. కేవలం ఇంగ్లీష్ జట్టును ఓడించడమే తమ లక్ష్యమని తెలిపాడు.
ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య మూడు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్ జులై 8 నుంచి ప్రారంభంకానుంది. ప్రేక్షకులు లేకుండానే ఈ సిరీస్ నిర్వహిస్తున్నారు. జులై 8 నుంచి 12 వరకు తొలి టెస్టు జరగనుంది. అనంతరం ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జులై 16 నుంచి 20, 24 నుంచి 28 వరకు రెండు, మూడు టెస్టులు జరుగుతాయి.
ఇది చూడండి : 'ఈసారి స్నేహానికి చోటు లేదు.. యుద్ధమే'