పాకిస్థాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ తమ దేశ సైన్యం కోసం గడ్డి తినేందుకైనా సిద్ధమని చెప్పాడు. ప్రస్తుతం ఆర్థికంగా చితికిపోయిన పాకిస్థాన్ సరైన ఆదాయం లేక రుణాలపై ఆధారపడి రోజులు నెట్టుకొస్తోంది. ఈ నేపథ్యంలో అక్తర్ ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో.. తనకు అవకాశం ఉంటే పాక్ ఆర్మీ బడ్జెట్ పెంచేందుకు కృషి చేస్తానని చెప్పాడు. పాక్ సైన్యాధినేతను తనతో చర్చించాలని అడుగుతానని, అలా కలిసి నిర్ణయాలు తీసుకుంటామని ప్రగల్భాలు పలికాడు. ఈ విషయాన్ని ఎవరైనా అవమానిస్తే అది పాకిస్థాన్‌కే నష్టమని పేర్కొన్నాడు.
"దేశం కోసం ప్రాణాలివ్వడానికైనా సిద్ధమే. అందుకోసం గడ్డి తినేందుకైనా సిద్ధమే. 1999లో భారత్‌తో జరిగిన కార్గిల్ యుద్ధంలో పాల్గొనాలనిపించింది. నాకు అవకాశం ఉంటే పాక్ ఆర్మీ బడ్జెట్ పెంచేందుకు కృషి చేస్తా. ఒకవేళ సైన్యం బడ్జెట్ 20 శాతం ఉంటే దానికి 60 శాతం చేస్తా."
-అక్తర్, పాక్ మాజీ క్రికెటర్
ఇదిలా ఉండగా, అక్తర్ ఇటీవల ఓ సందర్భంలో ట్వీట్ చేస్తూ.. టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. గతంలో ఒకసారి వీరూ మాట్లాడుతూ.. తాను, సచిన్ బ్యాటింగ్ చేస్తుండగా అక్తర్ తనను హుక్‌షాట్ ఆడమని కవ్వించాడని, దాంతో "నీ బాబు(సచిన్) అవతలి ఎండ్‌లో ఉన్నాడు. వెళ్లి అతడికి చెప్పు కొట్టి చూపిస్తాడు" అని దీటుగా జవాబిచ్చానని పేర్కొన్నాడు. ఆ మాటలను ఉద్దేశిస్తూ అక్తర్.. సెహ్వాగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. "ఒకవేళ సెహ్వాగ్ అలా అని ఉంటే బతికేవాడా?అక్కడే కొట్టి ఉండేవాడిని" అని వ్యాఖ్యానించాడు.