ఆస్ట్రేలియాతో రెండో టెస్టు వరకు రోహిత్ శర్మ జట్టులోనే లేడు. ఫిట్‌నెస్ సమస్యలు, క్వారంటైన్ కారణంగా వన్డేలు, టీ20లతో పాటు తొలి రెండు టెస్టులకు కూడా దూరంగా ఉన్న అతడు.. మూడో టెస్టు కోసం జట్టులోకి వచ్చాడు. నేరుగా మేనేజ్మెంట్ అతడికి వైస్ కెప్టెన్సీ అప్పగించేయడం చర్చనీయాంశమైంది.
కోహ్లీ తొలి టెస్టు తర్వాత జట్టుకు దూరమయ్యాక రహానె కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. పుజారా రెండో టెస్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. రోహిత్‌తో పోలిస్తే ఎక్కువ టెస్టులాడింది, టెస్టు జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్నది పుజారానే. గతేడాది దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో ఓపెనర్ అవతారమెత్తి రాణించడానికి ముందు వరకు రోహిత్‌కు టెస్టు జట్టులో చోటే ప్రశ్నార్థకం. అలాంటి ఆటగాడు సిరీస్ మధ్యలో జట్టులోకి రాగానే.. పుజారాను తప్పించి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే రోహిత్ ఇప్పటికే వన్డేలు, టీ20ల్లో వైస్ కెప్టెన్ కావడం.. చివరగా ఆడిన టెస్టు సిరీస్‌లో రాణించడం వల్ల అతనే వైస్ కెప్టెన్‌గా ఉండటానికి అర్హుడన్న ఉద్దేశంతో జట్టు యాజమాన్యం ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. "రోహిత్ సుదీర్ఘ కాలంగా వన్డేలు, టీ20ల్లో జట్టు వైస్ కెప్టెన్. కాబట్టి విరాట్ లేనపుడు జట్టు నాయకత్వ బృందంలో అతనుండటం అనివార్యం" అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
ఇదీ చూడండి: నటరాజన్.. మళ్లీ మ్యాజిక్ చేస్తాడా?