కమ్మనైన మాటలతో నేర్పుగా రెండు సిరీస్‌లను క్లీన్‌స్వీప్ చేశారు న్యూజిలాండ్ ఆటగాళ్లు. సారథి కోహ్లీపైనా, బౌలర్ బుమ్రాపైనా ప్రశంసలు కురిపిస్తూనే మాయచేసింది విలియమ్సన్ సేన. ఫలితం దాదాపు 8 ఏళ్ల తర్వాత టెస్టుల్లో భారత్ తడబడి వైట్‌వాష్ అయింది. 5 టీ20లు గెలిచిన గడ్డపైనే 3 వన్డేల సిరీస్‌ను ముట్టచెప్పింది. ఇక కోహ్లీ అయితే వారితో టెస్టు ర్యాంక్ పంచుకునేందుకు సిద్ధమని కూడా ప్రకటించేశాడు. కెరీర్లో తొలిసారి సారథిగానూ విఫలమై.. ఆ జట్టుకు తొలిసారి టెస్టు సిరీస్‌ను అప్పగించి వచ్చాడు.
మైదానంలో ఉద్వేగం లేదు, మాటల ఎదురదాడి లేదు. భారత్‌ను రెచ్చగొడితే ఓడిపోతామని తెలిసిన ప్రత్యర్థి కివీస్ జట్టు... తమ వ్యూహంలో మంచి మాటలకు చోటిచ్చింది. ప్రత్యర్థి ఆటను ప్రశంసిస్తూనే ఓడించాలని వ్యూహాలను పక్కాగా అమలు చేసింది.
సారథే లక్ష్యంగా..?
పరుగుల యంత్రం, ఛేదన రారాజు, మనిషి కాదు ఏలియన్... టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఎవరికీ సాధ్యమవ్వని నిలకడతో పరుగులు చేస్తున్నప్పుడు అందరూ అన్న మాటలివి. సోషల్ మీడియాలోనైతే 'సరిలేరు నీకెవ్వరు' అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఒక్క న్యూజిలాండ్ పర్యటనతో ఇప్పుడు మరో అర్థంతో కూడిన మాటలు వినిపిస్తున్నాయి. చెప్పలేనంత ట్రోలింగ్ కనిపిస్తోంది. బ్యాటింగ్ లైనప్ సమష్టిగా విఫలమైతే విమర్శలన్నీ అతనొక్కడిపైనే ఎక్కుపెడుతున్నారు. అనుభవం లేని ఓపెనర్ల సంగతి అటుంచితే నయావాల్ పుజారా, ఆధారపడతగిన రహానె కూడా నిలిచిందేమీ లేదుగా. కివీస్ లోయర్ ఆర్డర్ రెండు సార్లు 50 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పితే టీమిండియాలో పంత్, జడేజా, అశ్విన్ ఏం చేశారో అందరికీ తెలిసిందే. మరెందుకు కోహ్లీ ఒక్కడినే లక్ష్యంగా దాడి చేస్తున్నారు? అంటే ఓ కారణముంది.
రారాజునే ఆపేస్తే..!
ప్రపంచంలోనే విరాట్ కోహ్లీని మించిన ఆటగాడు ప్రస్తుతం ఎవరూ లేరు! అతడు నిలిస్తే జట్టుకు కొండంత బలం. మైదానంలో అతడి కనుసైగకు అంత పవర్ ఉంది. చక్రవర్తే తల వంచుకుంటే సైన్యం స్థైర్యం దిగజారుతుంది కదా. ఈ మాటలన్నీ అతిశయోక్తిగా అనిపించొచ్చు. కానీ మైదానంలో క్రికెట్ ఆడుతున్న జట్టును యుద్ధం చేస్తున్న సైన్యంతో పోల్చి చూడండి. వ్యూహ ప్రతివ్యూహాల్లో తేడా ఏం ఉండదు. రాజు ఒక్కడే సమరం గెలిపించలేడు. అలాగే కెప్టెన్ ఒక్కడే జట్టును విజయతీరాలకు చేర్చలేడు. యుద్ధమైనా, ఆటైనా అందరూ రాణించాల్సిందే. ఏ ఒక్కరో మెరిస్తే చాలదు. బలవంతుడైన చక్రవర్తి తన పరాక్రమంతో సేనకు ఎలాంటి ప్రేరణనిస్తాడో మైదానంలో సారథీ అంతే. అతనొక్కడే ఏం చేయలేకపోయినా చూపించే ప్రభావం మాత్రం అనంతం. స్టేడియంలో విరాట్ కూడా ఇంతే. ఓటమిని ఒప్పుకోడు. ప్రత్యర్థి మాటలు, చేష్టలను సవాల్‌గా తీసుకొని రాణిస్తాడు. సై అంటే సై అంటాడు. మనసులో గెలుపు గురించే తప్ప మరొకటి ఆలోచించడు. మరలాంటి కోహ్లీని న్యూజిలాండ్ ఎలా కట్టడి చేయగలిగింది?
రెచ్చిపోతే ఆపలేం..
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలో పర్యటించినప్పుడు విరాట్ కోహ్లీని ఆ క్రికెటర్లు ఎలా రెచ్చగొట్టేవారో గుర్తుందా? మిగతా భారతీయ క్రికెటర్లను స్లెడ్జింగ్ చేస్తే ఏకాగ్రత కోల్పోయేవారు. అతడూ వారిలాగే పెవిలియన్ వెళ్తాడేమోనని భావించేవారు. అండర్సన్, బ్రాడ్, స్టార్క్, హేజిల్‌వుడ్, రబాడ వంటి క్రికెటర్లు సిరీస్ ఆరంభానికి ముందే అతడిపై మానసికంగా పైచేయి సాధించాలని ఏదో ఒకటి అనేవారు. కానీ ఏం జరిగింది? మాటలతో రెచ్చగొడితే బ్యాటుతో సమాధానం చెబుతానని విరాట్ నిరూపించాడు. 2014-2016 వరకు అతడి ఆఫ్ స్టంప్ బలహీనతను ఆసరాగా చేసుకొని స్వింగ్, సీమ్ బంతులతో పెవిలియన్ పంపించారు. 2016 నుంచి ఇప్పటి వరకు అక్కడ ఎలా చెలరేగాడో అందరికీ తెలిసిందే. స్టాన్స్, తలను వంచడంలో మార్పులు చేసుకొని తన బలహీనతను ఎలా అధిగమించాడో చూశాం. కానీ బంతి గాల్లో స్వింగ్ అయ్యే ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌లో మాత్రం అతడి సగటు ఇప్పటికీ 37కు దిగువే. 2018లో ఇంగ్లాండ్‌లో రాణించినప్పటికీ కివీస్‌లో మాత్రం అలా జరగలేదు. ఎందుకంటే ఆంగ్లేయులు రెచ్చగొట్టారు? బ్లాక్‌క్యాప్స్ ప్రశంసించారు? కీర్తిస్తూనే అతడి మైండ్ బ్లాంక్ చేశారు. ఆపై కథ నడిపించారు.
ప్రశంసిస్తూనే పంపించారు
న్యూజిలాండ్ చాలా విచిత్రమైన జట్టు. వారి వ్యూహాలు, ప్రణాళికలు భిన్నంగా ఉంటాయి. స్లెడ్జింగ్, హేళన, కవ్వింపులు కనిపించవు. ప్రత్యర్థిని గౌరవిస్తారు. విరాట్‌ను బాగా అధ్యయనం చేసి కవ్విస్తే ప్రమాదకరమని గ్రహించారు. అందుకే బంతి గాల్లో స్వింగ్ అవుతున్నప్పుడు అతడి ఆఫ్‌స్టంప్ బలహీనతను మరోసారి పావుగా వాడుకున్నారు. దీని గురించి టీ20, వన్డే సిరీస్ జరుగుతున్నప్పుడు బయటపెట్టలేదు.
"విరాట్ కోహ్లీ ఎంతో గొప్ప ఆటగాడు. ప్రపంచ వ్యాప్తంగా అతడెలా పరుగులు చేస్తున్నాడో అందరికీ తెలుసు. అతడి బలహీనతలను వెతికి దాడి చేయడం అవివేకం. అతడిని అడ్డుకోవడం అంత సులభం కాదు" అనే అన్నారు. బంతులు మాత్రం ఆఫ్‌స్టంప్‌కే విసిరారు. ఇక బౌల్ట్ అయితే కోహ్లీ ఔట్ అవుతుంటే హర్షం వ్యక్తం చేసేవాడు.
మానసిక అడ్డంకులు సరేసరి
టీ20 సిరీస్‌ను 5-0తో కైవసం చేసుకొని వన్డే సిరీస్‌లో 0-3తో వైట్‌వాష్ అవ్వడం భారత జట్టు మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసింది. ఇది కోహ్లీ సహా అందరిపై పడిందనే చెప్పాలి. పైగా అలసట, మానసిక అడ్డంకులు ఉన్నాయి. ఆటగాళ్లకు గాయాలయ్యాయి. సన్నద్ధతకు సమయం దొరకలేదు. పచ్చికతో జీవం ఉట్టిపడుతున్న పిచ్‌లపై చల్లని వాతావరణంలో స్వింగ్ అయ్యే బంతుల్ని ఆడలేమన్న ఆలోచన వారి బుర్రల్లో నిండిపోయిందని విశ్లేషకులు అంటున్నారు.
విరాట్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదంటున్నారు. అందుకే ప్రశంసల మాటున కివీస్ మన పరుగుల యంత్రాన్ని పనిచేయనివ్వలేదు. అతడిలోని తీవ్రతను బయటకు రాకుండా శాంతిమంత్రం జపించారు. రారాజును అడ్డుకుంటే సైన్యం ఎంతోసేపు నిలవదనే వ్యూహం పన్నారు. అందుకే టీ20ల దూకుడును చల్లార్చి.. వన్డే, టెస్టు సిరీస్‌ల్లో గెలుపు అన్న ఊసే లేకుండా భారత్‌కు షాకిచ్చారు.