భారత జట్టులో మరోసారి వికెట్ కీపర్ చర్చ మొదలైంది. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో వికెట్ల వెనకాల బాధ్యతలు ఎవరు మోయాలనే అంశం మరోసారి ఆసక్తి రేపుతోంది. బ్యాటింగ్‌లో అదరగొడుతున్న యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను కొనసాగిస్తారా? లేదా అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్ సాహాను తీసుకుంటారా? అన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది.
బ్యాట్స్‌మన్‌గా..
జట్టుకు ఉపయోగపడే బ్యాట్స్‌మన్‌గా చూసుకుంటే సాహా కంటే పంత్ ముందంజలో ఉంటాడు. అతని దూకుడు జట్టుకు మేలు చేస్తుంది. అయితే విదేశాల్లో మన బ్యాట్స్‌మెన్‌కు సవాలు విసిరే పరిస్థితుల్లో మాత్రమే జట్టుకు అదనపు బ్యాట్స్‌మన్‌గా పంత్ ఉపయోగపడతాడనే భావన ఉంది. టాప్‌ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కొత్త బంతిని ఎదుర్కోవడంలో విఫలమై పెవిలియన్ చేరితే.. పంత్ లాంటి ఆటగాడు మిడిలార్డర్‌లో ఉంటే జట్టుకు కాస్త బలం ఉంటుందని విదేశాల్లో అతణ్ని ఆడించేందుకు మేనేజ్‌మెంట్ మొగ్గు చూపుతుంది.
ఆస్ట్రేలియాతో సిరీస్‌లోనూ తొలి టెస్టుకు సాహానే తీసుకున్నారు. కానీ భారత్ ఘోర ఓటమి చవిచూసిన ఆ మ్యాచ్‌లో అతను బ్యాట్‌తో రాణించలేదు. అందుకే రెండో టెస్టులో అతని స్థానంలో పంత్‌ను దింపారు. వికెట్ కీపర్‌గా అతని ప్రదర్శన పేలవంగా ఉన్నప్పటికీ.. బ్యాట్‌తో మాత్రం గొప్పగా రాణించాడు. ముఖ్యంగా చివరి రెండు టెస్టుల్లో అతనాడిన ఇన్నింగ్స్‌లు (97, 89 నాటౌట్) ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కానీ సొంతగడ్డపై టెస్టుల్లో భారత్‌కు అదనపు బ్యాట్స్‌మన్ అవసరమే పెద్దగా రాదు. ఎందుకంటే తమకు అనుకూలమైన పరిస్థితుల్లో టాప్‌ఆర్డర్ ఆటగాళ్లే పని పూర్తి చేస్తారు. పైగా ఇప్పుడు జట్టులోకి కెప్టెన్ కోహ్లి తిరిగి వచ్చాడు. గిల్ ఓపెనర్‌గా కుదురుకున్నాడు. స్వదేశంలో రోహిత్‌కు ఘనమైన రికార్డు ఉంది. వీళ్లతో పాటు పుజారా, రహానెలతో కూడిన బ్యాటింగ్ విభాగం బలంగా ఉంది కాబట్టి పంత్ అవసరం పడకపోవచ్చు.
వికెట్ కీపర్‌గా..
వికెట్ల వెనకాల ప్రదర్శన పరంగా చూసుకుంటే పంత్ కంటే సాహా ఎన్నో రెట్లు మెరుగన్నది అందరికీ తెలిసిన విషయమే. స్పిన్‌కు అనుకూలించే మన పిచ్‌లపై ఎక్కువగా తిరిగే బంతిని పట్టడానికి సాహా సరైనోడు. వికెట్ల వెనుక అతని ప్రదర్శన ఎప్పుడూ ఉత్తమంగానే ఉంటుంది. స్వదేశంలో అతడి బ్యాటింగ్ కూడా పర్వాలేదు. మరోవైపు పంత్ వికెట్ కీపింగ్‌పై ఇప్పటికే ఎన్నో విమర్శలున్నాయి. బంతిని సరిగా అంచనా వేయని అతను.. ఎన్నో క్యాచ్‌లు నేలపాలు చేశాడు. అలాగే స్టంపింగ్‌లోనూ వైఫల్యాన్ని ప్రదర్శించాడు.
దీని ఆధారంగా చూస్తే.. భారత్‌లో మ్యాచ్‌లకు ఎలాగూ అదనపు బ్యాట్స్‌మన్ అవసరం ఉండదు కాబట్టి వికెట్ల వెనకాల మంచి ప్రదర్శన చేయగలిగే ఆటగాడు చాలు అనుకుంటే తుది జట్టులోకి సాహానే రావచ్చు. అలా కాకుండా ఆసీస్‌లో రాణించి.. మంచి ఫామ్‌లో ఉన్న పంత్‌నే కొనసాగించాలనే జట్టు మేనేజ్‌మెంట్ ఆలోచననూ కొట్టిపారేయలేం. వికెట్‌కీపర్‌గా సాహాను ఉంచి, స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గా పంత్‌ను తీసుకునే ఆలోచనా చేయొచ్చు. ప్రస్తుత సిరీస్‌కు జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయంపైనే 36 ఏళ్ల సాహా కెరీర్ ఆధారపడి ఉంది. పంత్‌నే వికెట్‌కీపర్‌గా ఎంచుకుంటే.. సాహా కెరీర్ ప్రమాదంలో పడ్డట్లే!
ఇదీ చదవండి: 'విరాటే మా లక్ష్యం.. లేదంటే ప్రమాదం'