కరోనా ప్రభావం వల్ల దేశమంతా లాక్డౌన్లో ఉంది. అయితే దశల వారీగా ఆంక్షల సడలింపుల నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో నాలుగో విడతలో భారీగా సడలింపులు వచ్చే అవకాశముందని భావిస్తోంది బీసీసీఐ. అందుకే ఆయా రాష్ట్రాల్లో ఔట్డౌర్ శిక్షణా శిబిరాలను ప్రారంభించాలని ఏకంగా ప్రణాళికే రచిస్తోంది. అన్నీ కుదిరితే ఆటగాళ్లు శిబిరాల్లో శిక్షణ కూడా తీసుకోవచ్చు.
అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో లాక్డౌన్లో సడలింపులు ఇచ్చే అవకాశం లేదు. అందులో మహారాష్ట్ర ఒకటి. అయితే టీమ్ఇండియా కెప్టెన్, వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ ముంబయిలోనే ఉన్నారు. దీనివల్ల వీరిద్దరూ ఇండోర్ శిక్షణనే కొనసాగించే అవకాశం ఉందని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు.
వీలైనంత త్వరగా భారత ఆటగాళ్లు మళ్లీ మైదానంలో శిక్షణ పొందేలా చేసేందుకు బీసీసీఐ అన్ని రకాల ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే ఈ నెల 18 తర్వాత సాధన మొదలయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెటర్లు ప్రయాణించలేరు కాబట్టి వారి నివాసాలకు దగ్గరలోని మైదానాల్లో శిక్షణ కొనసాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.