'ఛేదన రారాజు'కు ఏమైంది? పరుగుల యంత్రానికి ఏమైంది? మునుపట్లా పరుగులు ఎందుకు చేయడం లేదు? శతకాల మోత ఎందుకు మోగించడం లేదు? నాయకత్వం అతడికి భారంగా మారిందా? ఒత్తిడికి గురవుతున్నాడా? మానసికంగా తాజాగా లేడా? శారీరకంగా అలసిపోయాడా? బుడగలు దుష్ప్రభావం చూపిస్తున్నాయా? ఇవీ.. టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ పదేపదే డకౌట్ అవుతుండటం వల్ల అభిమానుల్లో కలుగుతున్న సందేహాలు. ఎందుకంటే అతడి డకౌట్ల కథా ఆసక్తికరమే కదా మరి!!
కలవర పెట్టే '0'
అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల వరదకు మరోపేరుగా నిలిచిన ఆటగాడు విరాట్ కోహ్లీ. అత్యంత వేగంగా 1000, 2000, 3000... 10,000 పరుగుల ఘనతలు సృష్టించాడు. వందల రికార్డులు బద్దలు కొట్టేశాడు. పిచ్, బౌలర్‌తో సంబంధం లేకుండా బ్యాటింగ్ చేయడం శతకాలు సాధించడం అతడి నైజం. అలాంటిది 2019 నుంచి మునుపటి స్థాయిలో పరుగులు చేయడం లేదు. సెంచరీలూ కొట్టడం లేదు. చివరిసారిగా అతడు 2019, నవంబర్ 22న బంగ్లాదేశ్‌పై గులాబి టెస్టులో శతకం బాదాడు. వన్డేల్లోనైతే అదే ఏడాది ఆగస్టు 11న వెస్టిండీస్‌పై 120 పరుగులు చేశాడు. ఈ మధ్య కాలంలో అతడు స్వల్ప స్కోర్లకే వెనుదిరుగుతున్నాడు. ఆఖరి ఐదు ఇన్నింగ్సుల్లో విరాట్ మూడుసార్లు 'డకౌట్' కావడం కలవరపెడుతోంది. 0, 62, 27, 0, 0 అతడి స్కోర్లు.
428 మ్యాచులు.. 28 డకౌట్లు
కెరీర్లో ఇప్పటి వరకు 428 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన విరాట్ ఏకంగా 28 సార్లు ‘డకౌట్’ అయ్యాడు. వన్డేల్లో 13, టెస్టుల్లో 12, టీ20ల్లో 3సార్లు పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ బాట పట్టాడు. ఇంగ్లాండ్‌పై 66 మ్యాచుల్లో ఏకంగా 9సార్లు డకౌటయ్యాడు. ఆస్ట్రేలియాపై 6, వెస్టిండీస్‌పై 4, శ్రీలంకపై 3సార్లు ఖాతా తెరవలేదు. పాక్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఐర్లాండ్‌పై ఒక్కోసారి ‘డకౌట్’ అయ్యాడు. స్వదేశంలో, విదేశంలో సమానంగా డకౌట్లు అవ్వడం ఆసక్తికరం. భారత్‌లో 14, ఇంగ్లాండ్‌లో 5, వెస్టిండీస్‌లో 3, ఆస్ట్రేలియాలో 2 సార్లు సున్నాకే పరిమితం అయ్యాడు. 2011లో 4సార్లు డకౌటైన కోహ్లీ ఆ తర్వాత 2017లో అత్యధికంగా 5 సార్లు డకౌట్ కావడం గుర్తించాల్సిన విషయమే. 2021లో ఆడిన ఐదు ఇన్నింగ్సుల్లోనే 3 సార్లు సున్నాకు ఔటై కలవరపెట్టాడు. కెప్టెన్‌గా 14 సార్లు, ధోనీ సారథ్యంలో 11 సార్లు సున్నాకే వెనుదిరిగాడు.
పగటి పూటే ఎక్కువ
టాస్ ఓడినప్పుడు 20, టాస్ గెలిచినప్పుడు 8 సార్లు కోహ్లీ డకౌట్ అయ్యాడు. తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు 19, తొలుత ఫీల్డింగ్ చేసినప్పుడు 9సార్లు ఔటయ్యాడు. పగటిపూట ఆడిన 177 మ్యాచుల్లో 21సార్లు సున్నాకే పరిమితం అయ్యాడు. డే/నైట్‌లో 200 మ్యాచులాడితే 5, నైట్ మ్యాచుల్లో 51 సార్లు ఆడితే 2సార్లు డకౌటయ్యాడు. టీమ్‌ఇండియా గెలిచిన 251 మ్యాచుల్లో 15, ఓడిన 141 మ్యాచుల్లో 11, డ్రా చేసుకున్న 18 మ్యాచుల్లో 2 సార్లు పరుగుల ఖాతా తెరవకుండా పెవిలియన్ చేరాడు. ద్వైపాక్షిక సిరీసుల్లో ఏకంగా 25, 5+ జట్లు తలపడ్డ టోర్నీల్లో 5, 3-4 జట్లున్న టోర్నీల్లో 2సార్లు డకౌట్ అయ్యాడు. సిరీసు తొలి మ్యాచులో 8, రెండో మ్యాచులో 8, మూడో మ్యాచులో 2, నాలుగో మ్యాచులో 3, ఐదో మ్యాచులో 3, ఏడో మ్యాచులో ఒకసారి డకౌట్ కావడం గమనార్హం. ఐసీసీ ప్రపంచకప్ పోటీల్లో 14 మ్యాచుల్లో 4, బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో 20 మ్యాచుల్లో 3, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో 13 మ్యాచుల్లో ఒకసారి సున్నాకు వెనుదిరిగాడు. మూడో స్థానంలో 15, నాలుగో స్థానంలో 10, ఆరో స్థానంలో 2, ఐదో స్థానంలో ఒకసారి డకౌట్ అయ్యాడు.
‘బిగ్ 4’లోనూ ముందే!
ఆధునిక క్రికెట్లో ‘బిగ్ 4’తో పోల్చినప్పుడూ డకౌట్లలో కోహ్లీదే మొదటి స్థానం. 428 మ్యాచుల్లో 28 సార్లు ఔటైన సంగతి తెలిసిందే. జోరూట్ 284 మ్యాచుల్లో 15, కేన్ విలియమ్సన్ 301 మ్యాచుల్లో 17, స్టీవ్‌స్మిత్ 250 మ్యాచుల్లో 11 సార్లు డకౌట్ అయ్యారు. వీరందరిలో అత్యధిక మ్యాచులాడింది మాత్రం విరాటే. ఆసీస్ మాజీ సారథి స్మిత్ టెస్టుల్లో 5, వన్డేల్లో 5, టీ20ల్లో ఒకసారి సున్నాకే వెనుదిరిగాడు. కివీస్ కెప్టెన్ విలియమ్సన్ టెస్టుల్లో 9, వన్డేల్లో 5, టీ20ల్లో 3 సార్లు, ఇంగ్లాండ్ నాయకుడు జోరూట్ టెస్టుల్లో 8, వన్డేల్లో 5, టీ20ల్లో 2సార్లు డకౌటయ్యారు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికసార్లు డకౌటైన వారు మురళీ ధరన్ (59), కోర్ట్నీ వాల్ష్ (54), సనత్ జయసూర్య (53). ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో క్రిస్‌గేల్ అత్యధికంగా 44 సార్లు డకౌట్ అయ్యాడు. ఈ జాబితాలో కోహ్లీ స్థానం 63.