భవిష్యత్తులో జరిగే విషయాలు తనకు తెలుస్తుంటాయని భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అంటున్నాడు. గతంలో తాను అనుకున్నట్లే వన్డేల్లో రెండో హ్యాట్రిక్ సాధించానని చెప్పాడు. అందుకు తగ్గ ఉదాహరణను వెల్లడించాడు.
భారత్ తరఫున వన్డేల్లో రెండు హ్యాట్రిక్స్ తీసిన ఏకైక బౌలర్ కుల్దీప్. 2017లో ఆస్ట్రేలియాపై, గతేడాది వెస్టిండీస్‌పై ఈ ఫీట్ నమోదు చేశాడు.
"మీరు నమ్మకపోవచ్చు. రెండో హ్యాట్రిక్ తీయడానికి ముందే, ఆరోజు ఉదయం మా అమ్మకు ఇదే విషయం చెప్పా. ఆ ఘనత సాధించాను. ఇంతకుముందు కూడా వివిధ విషయాల్లో జోస్యం చెప్పాను. చాలావరకు నేను చెప్పింది నిజమైంది"
-కుల్దీప్ యాదవ్, భారత స్పిన్నర్
అయితే తన అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన తొలి ఏడాదే ప్రఖ్యాత ఈడెన్‌గార్డెన్స్‌లో హ్యాట్రిక్ తీయడం.. తన జీవితంలోనే మర్చిపోలేని విషయమని కుల్దీప్ ఆనందం వ్యక్తం చేశాడు.
ఈ ఏడాది ఐపీఎల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కోల్‌కతా నైట్‌రైడర్స్.. కచ్చితంగా కప్పు కొడుతుందని అభిప్రాయపడ్డాడు. గతేడాది విజేతగా నిలవాల్సిందని, కొద్దిలో చేజారిపోయిందని తెలిపాడు.