టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై వెస్టిండీస్ మాజీ క్రికెటర్ చంద్రపాల్ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచంలో కోహ్లీనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అని కొనియాడాడు.
" కోహ్లీనే అత్యుత్తమం. అతడు ఆటలో అన్ని కోణాలపై దృష్టిసారిస్తాడు. దాని ఫలితాలను మనం చూస్తూనే ఉన్నాం. కోహ్లీ ఫిట్‌నెస్ కోసం శ్రమిస్తాడు. తన నైపుణ్యం మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. కఠోర శ్రమ ఫలితాలను ఇస్తుందని అతడు నిరూపిస్తున్నాడు. అద్భుతంగా రాణించాలని బరిలోకి దిగే ఆటగాళ్లలో కోహ్లీ ఒకడు. ఎన్నో గొప్ప ప్రదర్శనలతో తన సత్తా ఏంటో చాటి చెబుతున్నాడు. ఆటలో అన్నిసార్లు టాప్‌లో ఉండటం సాధ్యం కాదు. కానీ, కోహ్లీ సాధ్యమేనని నిరూపిస్తున్నాడు"
-చంద్రపాల్, వెస్టిండీస్ మాజీ క్రికెటర్
కోహ్లీపై పాక్ మాజీ క్రికెటర్ పొగడ్తలు
కోహ్లీపై పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ జావేద్ మియాందాద్ ప్రశంసలు కురిపించాడు. విరాట్ బ్యాటింగ్ ప్రతిభకు తాను ముగ్ధుడినయ్యానని చెప్పాడు. భారత క్రికెట్‌లో ఉత్తమ బ్యాట్స్‌మన్ ఎవరు? అని నన్ను ప్రశ్నిస్తే కోహ్లీ అనే సమాధానం చెబుతానని అన్నాడు. కోహ్లీ ప్రదర్శనలు, గణాంకాలే తన గురించి చాలా చెబుతాయని.. విరాట్ షాట్లు, బ్యాటింగ్ శైలి క్లాస్‌గా ఉంటుందని అని పేర్కొన్నాడు.
భారత్ తరఫున విరాట్ కోహ్లీ... 86 టెస్టులు, 248 వన్డేలు, 81 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 7,240, వన్డేల్లో 11,867, టీ20ల్లో 2,794 పరుగులు చేశాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 70 శతకాలు సాధించాడు.