న్యూజిలాండ్ గడ్డపై వన్డే సిరీస్‌లో విజయం సాధించడంపై టీమిండియా సారథి రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. నాలుగో వన్డేలో ఘోర పరాభవం అనంతరం ఐదో వన్డేలో జట్టు సమిష్టి కృషితోనే విజయం సాధించామని వెల్లడించారు. వన్డే సిరీస్‌ను భారత్ 4-1తో కైవసం చేసుకుంది.
జట్టులో అందరూ రాణించడం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డాడు రోహిత్. లక్ష్య ఛేదనకే ప్రాధాన్యత ఇచ్చేవాళ్లమని, కానీ సిరీస్ దక్కించుకోవడం వల్ల ప్రయోగాలకు అవకాశం లభించిందని రోహిత్ తెలిపాడు.
రాయుడు-విజయ్ శంకర్ల భాగస్వామ్యమే కీలకం...
మ్యాచ్ విజయంలో రాయుడు- విజయ్ శంకర్లు నమోదు చేసిన 98 పరుగుల భాగస్వామ్యమే కీలకమని వివరించాడు రోహిత్.
"నాలుగు వికెట్లు చేజార్చుకున్న తర్వాత, క్రీజులో నిలదొక్కుకునే వారు అవసరం. రాయుడు- విజయ్ శంకర్ ఆ పని చేశారు. చివర్లో హర్ధిక్, కేదార్ జాదవ్‌ల ప్రదర్శన అద్భుతం."
---- రోహిత్ శర్మ.
సరైన సమయాల్లో వికెట్లు తీశారు...
బౌలర్లు కలసికట్టుగా పనిచేయటం భారత్ విజయానికి మరో కారణమని అన్నాడు రోహిత్.
"ఓ దశలో ఛేదన ఎంతో సులభం అనిపించింది. కానీ బౌలర్లు అద్భుత ప్రదర్శన కనిబరిచారు. అందరి కృషి వల్లే విజయం సాధించాం. 250 పరుగులు ఆ పిచ్‌పై మంచి స్కోర్ అనిపించింది. కీలక సమయాల్లో బౌలర్లు వికెట్లు తీశారు."
--- రోహిత్ శర్మ.