క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవలే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ వాయిదాతో లీగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లైంది. ఈ క్రమంలోనే బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీలు లీగ్ నిర్వహణకు ప్రణాళికలు రచిస్తున్నాయి.
ఇటీవలే, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాడు సురేశ్ రైనా ఘజియాబాద్‌లోని తన వ్యక్తిగత శిక్షణా కేంద్రంలో ట్రైనింగ్ ప్రారంభించాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు. రైనాతో పాటు, బౌలర్లు మహ్మద్ షమీ, పీయూష్ చావ్లా, బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్లూ లీగ్‌కు సన్నద్ధమవుతున్నారు.
ఈ సందర్భంగా ఐపీఎల్ నిర్వహణపై స్పందించిన రైనా.. టోర్నమెంటు ఎప్పుడు జరుగుతుందో అని ఆటగాళ్లు ఆలోచించాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై దృష్టి సారించి... లీగ్‌కు ఎప్పుడు పిలిచినా సిద్ధంగా ఉండేలా తయారవ్వాలని తెలిపాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"ఫ్రాంచైజీలు వారి పనులు చేసుకుంటున్నాయి. మా పని మేము చేస్తున్నాం. వారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఈ క్రికెట్ లీగ్ ఆడేందుకు మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత.. ఆటగాడికి కనీసం 3,4 వారాల శిక్షణ అవసరం. ఐపీఎల్ ఎప్పుడు జరిగినా నాకు సంతోషమే. కాకపోతే ప్రస్తుత కరోనా పరిస్థితి కారణంగా అభిమానులను అనుమతించకపోతే.. మేము వారిని కోల్పోతాం."
-సురేశ్ రైనా, టీమ్ఇండియా క్రికెటర్
లాక్డౌన్ కారణంగా దాదాపు 6 నెలలకు పైగా క్రికెటర్లకు విరామం లభించింది. దీంతో వారంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్లీ పుంజుకోవాలంటే కచ్చితంగా శిక్షణ అవసరమని రైనా ఉద్ఘాటించాడు.