క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ తేదీ ఖరారైంది. సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా లీగ్ జరగనుందని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ అధికారికంగా వెల్లడించారు. ఫైనల్ నవంబరు 8న ఉంటుందని, ఆగస్టు 20 కల్లా అన్ని ప్రాంఛైజీలు యూఏఈకి చేరుకుంటాయని తెలిపారు. త్వరలోనే బీసీసీఐ పాలకమండలి సమావేశం తర్వాత.. ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ను విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
"దీనిపై త్వరలోనే సమావేశం జరగనుంది. అదే రోజున ఐపీఎల్ ప్రణాళికను సిద్ధం చేయనున్నాం. టోర్నీ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 మధ్య జరగుతుంది. దీనికి ప్రభుత్వ అనుమతి లభిస్తుందని ఆశిస్తున్నాం. ఈసారి ఐపీఎల్ 51 రోజుల పాటు సాగనుంది"
బ్రిజేశ్ పటేల్, ఐపీఎల్ ఛైర్మన్
కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా ఆస్ట్రేలియాలో నిర్వహించాల్సిన టీ20 ప్రపంచకప్ ఇప్పటికే యిదా పడింది. దీంతో ఐపీఎల్ నిర్వహించడానికి బీసీసీఐకి మార్గం సుగమమైంది. కానీ, ఇదే కారణం వల్ల టోర్నీని భారత్లో నిర్వహించలేక.. యుఏఈలో నిర్వహించనున్నట్లు బ్రిజేష్ పటేల్ తెలిపాడు.