టీమ్ఇండియా మాజీ బ్యాట్స్‌మన్ వసీం జాఫర్ తాజాగా ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్‌హాగ్‌ను ట్రోల్‌చేశాడు. తొలుత హాగ్ ట్వీట్ చేస్తూ భారత టాప్‌ఆర్డర్‌ను విమర్శించాడు. "టీమ్ఇండియా టాప్‌ఆర్డర్ ఆఫ్‌స్టంప్ ఎక్కడుందో తెలుసుకొని ఆడాలి. మంచి లెంగ్త్‌లో పడిన బంతిని ఆడకుండా వదిలేయడం నేర్చుకోవాలి. అలాగే ఆఫ్‌స్టంప్‌నకు దూరంగా వెళ్తున్న బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నించకూడదు" అని దెప్పిపొడిచే విధంగా పేర్కొన్నాడు. శుక్రవారం ఆస్ట్రేలియా-ఎ తో ప్రారంభమైన రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ చూసి ఇలా వ్యాఖ్యానించాడు. దీనికి స్పందించిన జాఫర్ అంతే దీటుగా బదులిచ్చాడు.
"ఆస్ట్రేలియా ముందు తమ టాప్‌ఆర్డర్ ఎవరో తెలుసుకోవాలి. మరో నాలుగు రోజుల్లో టీమ్‌ఇండియాతో ప్రారంభమయ్యే తొలి టెస్టులో తమ ఓపెనర్లుగా ఎవరు దిగనున్నారనే విషయంపై ఆస్ట్రేలియాకే స్పష్టత లేదు.
-జాఫర్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా ఇప్పటికే తొలి టెస్టుకు దూరమయ్యాడు. యువ బ్యాట్స్‌మన్ విల్ పుకోవిస్కీ కూడా ఇటీవల తొలి ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా కంకషన్‌కు గురయ్యాడు. తాజాగా మరో ఆటగాడు కూడా ఆ జట్టులో గాయం బారిన పడ్డాడు. ఈ నేపథ్యంలోనే కంగారూలు శనివారం తమ జట్టులోకి మార్కస్ హారిస్‌ను తీసుకున్నారు. దీంతో జోబర్న్స్‌తో కలిసి అతడు తొలి టెస్టులో ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. ఏదేమైనా డిసెంబర్ 17న అడిలైడ్‌లో తొలి టెస్టు ప్రారంభమయ్యే సమయానికే ఆస్ట్రేలియా తరఫున ఎవరు ఓపెనింగ్ చేస్తారనే విషయం తెలుస్తుంది.