దక్షిణాఫ్రికా పేస్‌బౌలర్ రబాడా టెస్టుల్లో 200 వికెట్లు సాధించడంపై టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్ వసీం జాఫర్ ప్రశంసలు కురిపించాడు.
దక్షిణాఫ్రికా ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనలో ఉంది. కరాచీలో జరుగుతున్న తొలి టెస్టులో పాక్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా రబాడా 3 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌కు ముందు 197 వికెట్లతో కొనసాగుతున్న అతడు ప్రస్తుతం 200 మైలు రాయి చేరుకున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా తరఫున ఈ ఘనత సాధించిన ఎనిమిదో క్రికెటర్‌గా నిలిచాడు. అలాగే ఈ ఫార్మాట్‌లో 200 వికెట్లు తీసిన వారిలో రబాడా (40.8) అత్యుత్తమ స్ట్రైక్‌రేట్ కలిగిన బౌలర్‌గానూ రికార్డు నెలకొల్పాడు.
ఈ విశేషాన్ని తెలియజేస్తూ ఓ క్రీడా సంస్థ పోస్టు చేసిన ట్వీట్‌కు జాఫర్ స్పందించాడు. "టెస్టుల్లో 200 వికెట్లు తీసిన రబాడాకు అభినందనలు. అది కూడా ఈ ఫార్మాట్‌లో అత్యుత్తమ స్ట్రైక్‌రేట్ సాధించిన దిగ్గజాల్లో ఒకడిగా నిలిచాడు. అయితే, ఇప్పుడతడి వయస్సు 25 ఏళ్లే. భవిష్యత్‌లో అతడు సాధించేది ఆలోచిస్తే భయమేస్తుంది" అని జాఫర్ ప్రశంసించాడు.
కాగా, పాక్‌తో తొలి టెస్టులో ఘోరంగా ఓడిపోయింది దక్షిణాఫ్రికా. దీంతో బౌలింగ్‌పైనే కాక బ్యాటింగ్ పైనా దృష్టి సారిస్తానని చెప్పాడు రబాడా. తన ఘనత పట్ల హర్షం వ్యక్తం చేశాడు. "డేల్ స్టెయిన్, అల్లన్ డొనాల్డ్ సరసన నా పేరు నిలవడం చాలా సంతోషంగా ఉంది. బౌలింగ్ చేసేటప్పుడు రికార్డులు దృష్టిలో పెట్టుకోను. శక్తిమేరకు ఆడి జట్టుకు ప్రయోజనం చేకూర్చాలి." అని రబాడా అన్నాడు.
ఇదీ చూడండి: దక్షిణాఫ్రికా పేసర్ రబాడా మరో రికార్డు