15 వరుస టెస్టు విజయాలతో రికార్డు నెలకొల్పిన ఆస్ట్రేలియా.. 2001లో భారత పర్యటనకు వచ్చింది. ముంబయిలో తొలి టెస్టు. మూడు రోజుల్లో అయిపోయింది. 10 వికెట్ల తేడాతో భారత్ చిత్తయింది. ఈడెన్‌లో రెండో టెస్టు. ఇంకో మూడు రోజుల్లో మ్యాచ్ ఆరంభం కాబోతోంది. లక్ష్మణ్ ఫిజియో దగ్గరికెళ్లి వెన్నులో నొప్పిగా ఉందన్నాడు. షర్టు విప్పి అద్దంలో చూడమన్నాడు లీపస్. వీపులో వాపు కనిపించింది. ప్రాక్టీస్ చేయొద్దన్నాడు. అప్పటికే ఓ మ్యాచ్ పోయింది. ఆస్ట్రేలియాపై మంచి రికార్డున్న లక్ష్మణ్‌ను పక్కన పెట్టలేకపోయారు కెప్టెన్, కోచ్. మొదట ఆస్ట్రేలియా 445 పరుగులు చేసింది. భారత్ 171 పరుగులకే ఆలౌట్. అందులో వీవీఎస్ వాటా 59.
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆడింది 58.1 ఓవర్లే. 274 లోటుతో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత్‌ను చుట్టేస్తే.. మరోసారి మూడు రోజుల్లోనే జయకేతనం ఎగరేసేద్దాం అన్న ఆలోచనతో స్టీవ్ వా ఫాలోఆన్ ఇచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో చివరి వికెట్ రూపంలో వెనుదిరిగిన వీవీఎస్.. డ్రెస్సింగ్ రూంలో ప్యాడ్లు విప్పబోతుంటే కోచ్ రైట్ వచ్చి ఆపాడు. మూడో స్థానంలో వెళ్దువు, ఆగమన్నాడు. 17వ ఓవర్లో రమేశ్ ఔటవడంతో లక్ష్మణ్ మళ్లీ మైదానానికి కదిలాడు. ఇక్కడి వరకు మ్యాచ్‌లో జరిగిందంతా మామూలు కథే! ఆ ఇన్నింగ్స్‌కు ముందు, దాని తర్వాత అని విభజించి చూసుకునేంతగా భారత క్రికెట్ చరిత్ర మారిపోతుందని ఆ క్షణంలో ఎవ్వరూ ఊహించి ఉండరు!
కాస్ప్రోవిచ్ బౌలింగ్‌లో కళ్లు చెదిరే ఓ కవర్ డ్రైవ్‌తో మొదలైంది ఆ అసాధారణ పరుగుల ప్రవాహం. అతడి చేతిలో మంత్రదండంలా మారిన బ్యాటు.. వారెవా అనిపించే షాట్లను జాలువారుస్తూ సాయంత్రానికి శతకంతో అభివాదం చేసింది. ఆట ఆఖరుకు లక్ష్మణ్ 109, ద్రవిడ్ 7 పరుగులతో పెవిలియన్‌కు కదిలారు. కానీ ఇదే జోడీ తర్వాతి రోజు సాయంత్రం కూడా ఇలాగే కలిసి మైదానాన్ని వీడటం ప్రపంచ క్రికెట్లో పెను సంచలనం. నాలుగో రోజు ఉదయం బ్యాటింగ్ ఆరంభించే సమయానికి భారత్ స్కోరు 254. సాయంత్రానికి 584. 90 ఓవర్లు.. 330 పరుగులు.. ఒక్కటంటే ఒక్క వికెట్ లేదు. ఆస్ట్రేలియా జట్టులో తొమ్మిది మంది బౌలర్లు ప్రయత్నించారు. ఫలితం లేదు.
అవతల ద్రవిడ్ నుంచి అద్భుతమైన సహకారం అందడంతో.. వీవీఎస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఎప్పుడూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ వికెట్ల సంబరాలు చేసుకునే మెక్‌గ్రాత్, వార్న్ లాంటి దిగ్గజాల మీద అతను చూపించిన ఆధిపత్యం గురించి.. క్రీజులో ఓ నృత్యకారుడిలా పాదాల్ని కదుపుతూ ఆడిన సొగసరి షాట్ల గురించి.. ఆ రోజు భారత అభిమానులు అనుభవించిన ఆనందం గురించి ఎంతని వర్ణించాలి? వెన్ను నొప్పి వేధిస్తున్నా చికిత్స తీసుకుంటూ అతను సాగించిన పోరాటం అద్వితీయం.
ఒక్కో మైలురాయిని దాటుతూ.. రికార్డుల పని పడుతూ సాయంత్రానికి 275 పరుగులతో అజేయంగా పెవిలియన్‌కు కదిలాడు వీవీఎస్. తర్వాతి రోజు ఉదయం త్రిశతక చరిత్ర కోసం అభిమానులు ఎంత ఉత్కంఠగా చూశారో! కానీ ఇంకో 6 పరుగులే జోడించి.. మెక్‌గ్రాత్ ఆఫ్ స్టంప్‌కు దూరంగా విసిరిన బంతిని వెంటాడి పాయింట్‌లో పాంటింగ్‌కు దొరికిపోయాడు లక్ష్మణ్. కొన్ని క్షణాల నిశ్శబ్దాన్ని అధిగమించి ఆ యోధుడిని అభినందించే పనిలో పడింది ఈడెన్. 657/7 వద్ద భారత్ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడం.. 384 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూ జట్టు హర్భజన్ (6/73) ధాటికి 212 పరుగులకే కుప్పకూలడం.. భారత్ 171 పరుగుల తేడాతో భారీ విజయం సాధించడం.. ఇదంతా ఓ చరిత్ర! తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగుల వెనుకబడి, ఫాలోఆన్ ఆడి గెలవడమంటే మాటలా? ఈ దెబ్బకు ప్రపంచ జట్లన్నీ చాలా ఏళ్లు ఫాలోఆన్ ఇవ్వడానికే జడిశాయంటే లక్ష్మణ్ ఇన్నింగ్స్ ప్రభావం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ క్రికెట్‌పై ఇంతగా ప్రభావం చూపించిన, తరతరాలకు ఓ పాఠంలా చెప్పుకునేంత విలువ తెచ్చుకున్న మరో ఇన్నింగ్స్ ఉందా అంటే సందేహమే!
వెన్ను నొప్పి వల్ల ఈడెన్ టెస్టులో నేను ఆడననే అనుకున్నా. మ్యాచ్‌కు ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయలేదు. పూర్తి ఫిట్‌నెస్ లేకున్నా నన్ను మ్యాచ్ ఆడించారు. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కూడా వెన్నునొప్పి వచ్చింది. మధ్య మధ్యలో ఫిజియో చికిత్స అందించాడు. ఈడెన్ గార్డెన్స్ పాత డ్రెస్సింగ్ రూమ్‌లో కాళ్లు చాపుకుని కూర్చునేలా మహారాజా కుర్చీలు ఉండేవి. వెన్నునొప్పి ఎక్కువ కాకుండా చెక్క కుర్చీలోనే కూర్చున్నా. రెండో ఇన్నింగ్స్‌లో మూడో స్థానంలో హుషారుగా బ్యాటింగ్‌కు వెళ్లా.ద్రవిడ్, నేను ఆత్మరక్షణతో కాకుండా.. అలాగని ఎక్కువ దూకుడు లేకుండా ఆడాలనుకున్నాం. నేను మూడో రోజు సెంచరీ చేశా. నాలుగో రోజు ఉదయం కూడా డ్రెస్సింగ్ రూమ్ గంభీరంగానే ఉంది. మ్యాచ్‌పై ఎవరికీ ఆశల్లేవు. ద్రవిడ్, నేను ఎప్పుడు బ్యాటింగ్ చేసినా ఒకరి ఆటలో మరొకరం జోక్యం చేసుకోం. ఓవర్ మధ్యలో కలిసినప్పుడు ‘వన్ మోర్ ఓవర్’ అనుకునే వాళ్లం.. అంతే. తర్వాత వన్ మోర్ ఓవర్.. వన్ మోర్ హవర్.. వన్ మోర్ సెషన్ అనుకుంటూ ఆట కొనసాగించాం. మా పరుగుల జోరుకు కంగారూలు అలసిపోయారు.. నిరాశకు లోనవుతున్నారని గ్రహించాం. టీ సమయానికి మేం కూడా బాగా అలసిపోయాం. పైగా నేను వెన్ను నొప్పితో.. రాహుల్ వైరల్ జ్వరంతో బాధపడ్డాం. నాలుగో రోజంతా ఆడాక జట్టు శిబిరంలో వాతావరణం మారిపోయింది. ఆట అయ్యాక డ్రెస్సింగ్ రూంలో నాకు, ద్రవిడ్‌కు ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించారు. అయిదో రోజు 10 ఓవర్లు ఆడి రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయాలన్నది ప్రణాళిక. ఇంకో 25 పరుగులు చేస్తే నా నా ట్రిపుల్ సెంచరీ. ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా నన్ను చూడాలనుకుంటున్నట్లు రైట్ అన్నాడు. కానీ అది జరగలేదు. ట్రిపుల్ సెంచరీ చేయనందుకు అస్సలు బాధపడలేదు. నేనాడిన ఇన్నింగ్స్ జట్టుకు ఉపయోగపడిందా లేదా అన్నదే ముఖ్యం.
ఒకే బంతి.. రెండు షాట్లు
బ్యాట్స్‌మన్ : వీవీఎస్ లక్ష్మణ్
పరుగులు : 281
బంతులు : 452
ప్రత్యర్థి : ఆస్ట్రేలియా
ఫలితం : 171 పరుగులతో భారత్ గెలుపు
సంవత్సరం: 2001
"అతను ఒకే రకమైన బంతికి మిడ్‌వికెట్‌లో ఫోర్ కొట్టాడు, కవర్స్‌లోనూ బౌండరీ సాధించాడు"
ఈడెన్‌లో లక్ష్మణ్ ఇన్నింగ్స్ ఎంత గొప్పగా సాగిందో చెప్పడానికి దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ చేసిన ఈ ఒక్క వ్యాఖ్య చాలు. లెగ్ స్టంప్‌కు చాలా దూరంగా బంతిని విసిరి ఆఫ్ స్టంప్ మీదికి టర్న్ చేస్తూ వార్న్ ఎందరో మేటి బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించిన సంగతి క్రికెట్ ప్రేమికులందరికీ తెలుసు. అయితే క్రీజు వదిలి ముందుకొచ్చి ఈ తరహా బంతులు పడీ పడంగానే లాఫ్టెడ్ షాట్లతో బౌండరీ రాబట్టే మార్గం సచిన్ చూపించాడు. కానీ దాన్ని అందరూ అందిపుచ్చుకోలేదు. కానీ వీవీఎస్ మాత్రం సచిన్ షాట్లకు తనదైన రూపం ఇచ్చాడు. మాస్టర్ ఎక్కువగా లాఫ్టెడ్ షాట్లు ఆడితే.. లక్ష్మణ్ ఈడెన్‌లో ఈ బంతులకు భిన్నమైన షాట్లు ఆడాడు. ముందుకొచ్చి వార్న్ బంతుల్ని వికెట్‌కు రెండు వైపులా డ్రైవ్ చేశాడతను. ఒకసారి మిడ్‌వికెట్‌లో అందమైన డ్రైవ్ షాట్ ఆడిన అతను.. మరోసారి కవర్స్‌లో కళ్లు చెదిరే రీతిలో బౌండరీకి పంపించిన వైనం వార్న్‌నే కాదు చూసే వీక్షకులనూ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇవేనా.. ఈ ఇన్నింగ్స్‌లో 44 బౌండరీల్లో ప్రతిదీ ఓ ఆణిముత్యమే. కాస్ప్రోవిచ్ బంతిని కొలిచినట్లు ఆడిన కవర్ డ్రైవ్.. మెక్‌గ్రాత్ షార్ట్ డెలివరీకి ఆడిన పుల్ షాట్.. గిలెస్పీ బౌలింగ్‌లో కొట్టిన స్ట్రెయిట్ డ్రైవ్.. అన్నీ అద్భుతాలే! కవర్ డ్రైవ్, ఆన్ డ్రైవ్, స్ట్రెయిడ్ డ్రైవ్, స్క్వేర్ కట్, పుల్ షాట్.. ఇవన్నీ పుస్తకంలోంచి నేరుగా లక్ష్మణ్ బ్యాటు ద్వారా దృశ్య రూపంలోకి వచ్చేశాయి ఆ మ్యాచ్‌లో. ఏ షాట్ ఎలా ఆడాలో ఒక పాఠంలా చెప్పడానికి ఈ ఇన్నింగ్స్ ఉదాహరణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.