వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం వీవీ రిచర్డ్స్ ఓసారి పాకిస్థాన్ మాజీ పేసర్ వసీం అక్రమ్‌ను కొట్టడానికి వెళ్లాడట. మైదానంలో తాను స్లెడ్జింగ్ చేయడం వల్ల ఆగ్రహానికి లోనైన రిచర్డ్స్.. బ్యాటుతో తమ డ్రెస్సింగ్ రూమ్ వద్దకు రావడం చూసి తాను భయంతో పరుగెత్తానని అక్రమ్ స్వయంగా చెప్పాడు. 1988లో బార్బడోస్ టెస్టు సందర్భంగా జరిగిన సంఘటన ఇది.
"రిచర్డ్స్ చాలా బలంగా ఉండేవాడు. నేనేమో సన్నగా ఉండేవాణ్ని. అది ఆ రోజుకు చివరి ఓవర్. నేను చాలా వేగంగా బంతులేస్తున్నా. ఓ బౌన్సర్‌తో రిచర్డ్స్ టోపీ కింద పడిపోయింది. రిచర్డ్స్ వద్దకు వెళ్లి వచ్చీరాని ఇంగ్లీష్‌లో స్లెడ్జింగ్ చేశా. అలా చేయొద్దని అతడు చెప్పాడు. సరే అని చెప్పి మా కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ వద్దకు వెళ్లి విషయం చెప్పా. అతడి మాటలు పట్టించుకోవద్దని, బౌన్సర్లు వేయమని ఇమ్రాన్ చెప్పాడు. అలాగే మళ్లీ బౌన్సర్ వేసి, రిచర్డ్స్‌ను మళ్లీ తిట్టా. ఆ రోజు చివరి బంతికి ఇన్‌స్వింగర్‌తో అతణ్ని బౌల్డ్ చేశా. డ్రెస్సింగ్ రూమ్‌లో షూస్ విప్పుతుంటే బయటికిరా అంటూ నన్నెవరో పిలవడం వినిపించింది. బయటికి వెళ్లి చూస్తే రిచర్డ్స్ చొక్కా లేకుండా నిలబడి ఉన్నాడు. చేతిలో బ్యాటుతో చెమటలు కక్కుతున్నాడు. నేను భయంతో ఇమ్రాన్ దగ్గరకు పరుగెత్తా. 'నేనేం చేయాలి. ఇది నీ గొడవ. నువ్వే పరిష్కరించుకో' అన్నాడు. అప్పుడు నేను బయటికి వెళ్లి రిచర్డ్స్‌కు క్షమాపణలు చెప్పా. మరోసారి ఇలా చేస్తే చంపేస్తానని అన్నాడు" అని అక్రమ్ చెప్పాడు.
ఇదీ చూడండి.. చరిత్ర సృష్టించిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా