బీసీసీఐ 39వ అధ్యక్షుడి హోదాలో బాధ్యతలు చేపట్టిన సౌరభ్ గంగూలీ... నేడు భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో భేటీ కానున్నాడు. బుధవారం గంగూలీ అధ్యక్షతన పూర్తిస్థాయి బోర్డు సమావేశం జరిగింది. అనంతరం అధ్యక్షుడి హోదాలో తొలిసారి మీడియాతో మాట్లాడాడు దాదా. టీమిండియా సారథి కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు.

"ప్రస్తుత భారత క్రికెట్‌లో అత్యంత ప్రధానమైన వ్యక్తి విరాట్ కోహ్లీ. నాలుగేళ్లలో టీమిండియా అద్భుత విజయాలు సాధించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అన్ని విభాగాల్లోనూ పటిష్ఠపరచి... ప్రపంచంలోనే భారత జట్టును మేటిగా తయారుచేసేందుకు విరాట్ ప్రయత్నిస్తున్నాడు. అతడికి అన్ని విధాలా మద్దతు ఇస్తాం. టీమిండియాకు కావాల్సిన అన్ని సదుపాయాలను సమకూరుస్తాం"
-- గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
ధోనీ కెరీర్‌పైనా చర్చ...
ఈరోజు కోహ్లీతో జరగనున్న సమావేశంలో టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్ భవితవ్యంపైనా చర్చిస్తానని గంగూలీ తెలిపాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా తొలి మీడియా సమావేశంలో మహీపై ప్రశంసల వర్షం కురిపించాడు దాదా. అంతేకాకుండా రెండు ప్రపంచ కప్‌లను అందించిన ధోనీకి తన హయాంలో సముచిత గౌరవం లభిస్తుందని స్పష్టం చేశాడు.

" విజేతలు అంత త్వరగా ముగించరని మీకందరికీ తెలుసు. ధోనీ తన కెరీర్ గురించి ఏం ఆలోచిస్తున్నాడో, అతడి మదిలో ఏముందో నాకు తెలీదు. దాని గురించి మేం మాట్లాడతాం. అతనో గొప్ప ఆటగాడు. క్రికెట్లో ఎంఎస్ చాలాకాలం కొనసాగినందుకు భారత్ గర్విస్తోంది. అతడు సాధించిందేంటో మీరు ఒకసారి కూర్చొని ఆలోచిస్తే వావ్ ఎంఎస్ ధోనీ అంటారు. వీడ్కోలు ఎప్పుడు పలకాలన్నది అతడిపై ఆధారపడి ఉంటుంది. నేను రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు ప్రపంచమంతా అలా చేయొద్దన్నది. మళ్లీ వచ్చి నేను నాలుగేళ్లు ఆడా. దిగ్గజాలకు ఎప్పుడూ ఘనమైన వీడ్కోలు దక్కుతుంది. నేనిక్కడ ఉన్నంత వరకు ప్రతి ఒక్కరికీ గౌరవం లభిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు".
--గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ తర్వాత మహీ.. జట్టుకు దూరమయ్యాడు. స్వదేశంలో వచ్చే నెల నుంచి బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ధోనీ అందుబాటులో ఉండడని సమాచారం. డిసెంబర్లో విండీస్‌తో సిరీస్‌లో పాల్గొంటాడని తెలుస్తోంది.