1996 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ ఆమిర్ సోహేల్‌ను ఔట్ చేసిన విధానం నుంచి భారత జట్టుకు బౌలింగ్ కోచ్‌గా తాను ఎదిగిన తీరును వివరించాడు టీమ్ఇండియా మాజీ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్. ఆ క్రమంలోనే 2007 టీ20 ప్రపంచకప్ సందర్భంగా పాక్‌తో లీగ్ స్టేజ్‌లో తలపడిన ఓ మ్యాచ్ గురించి స్పందించాడు. ఆ మ్యాచ్ టైగా మారడం వల్ల బౌలౌట్ విధానంలో భారత్ విజయం సాధించింది.
ఇదే విషయంపై అశ్విన్ వెంకటేశ్ ప్రసాద్‌ను ప్రశ్నించాడు. బౌలౌట్ విధానంలో రెగ్యులర్ బౌలర్లను కాకుండా సెహ్వాగ్, ఉతప్పలను ఎంచుకోవడం ఏంటని అడిగాడు. దానికి స్పందించిన మాజీ పేసర్. అప్పుడు ఏం జరిగిందనే విషయంపై స్పష్టతనిచ్చాడు. ఆ టోర్నీలో నియమ నిబంధనలు పూర్తిగా తెలుసుకున్నామని, తద్వారా ఏదైన మ్యాచ్ టైగా మారితే బౌలౌట్ విధానం అమలు చేస్తారని తెలిసిందని చెప్పాడు. అయితే, అంతకన్నా ముందే టీమ్‌ఇండియా ఆ బౌలౌట్ పద్ధతిని ప్రాక్టీస్ చేసేదని వెంకటేశ్ అన్నాడు. అప్పుడు చాలా మంది బ్యాట్స్‌మన్ కూడా బౌలింగ్ చేయడానికి ఆసక్తి చూపించారని, అందులో ధోనీ, సెహ్వాగ్, ఉతప్ప లాంటి బ్యాట్స్‌మన్ ఉన్నారన్నాడు.
అలా తాను వెనుక నుంచి ఎవరు నిలకడగా వికెట్లకు నేరుగా విసురుతున్నారో గమనించేవాడినని చెప్పుకొచ్చాడు వెంకటేశ్. ఈ నేపథ్యంలోనే తాను సెహ్వాగ్, ఉతప్ప, భజ్జీ నిలకడగా వికెట్లకు తాకేలా బంతులేస్తున్నారని గ్రహించి ఆ విషయాన్ని ధోనీకి చెప్పినట్లు పేర్కొన్నాడు. ఆ విషయంలో ధోనీని ఒప్పించడం తనకు పెద్ద ఇబ్బంది కాలేదన్నాడు. చివరికి ధైర్యం చేసి వారినే పాకిస్థాన్‌పై బౌలౌట్‌కు పంపామని వెల్లడించాడు.