భారత బ్యాట్స్‌మెన్‌లలో ఒకప్పుడు క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ తన ఫేవరెట్‌గా ఉండేవాడని, ఇప్పుడు ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ అని పాకిస్థాన్ మాజీ పేసర్ ఉమర్‌గుల్ తెలిపాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన గుల్ తన ఫేవరెట్ బ్యాట్స్‌మన్ విషయంలో ఎందుకు అభిప్రాయం మార్చుకోవాల్సి వచ్చిందో చెప్పాడు.
"ఒకప్పుడు భారత జట్టులో నాకు సచిన్ అంటే ఇష్టం ఉండేది. ఇప్పుడైతే విరాట్ కోహ్లీ. నాలుగైదేళ్లుగా అతను ఆడుతున్న విధానం నన్ను ఆకట్టుకుంటోంది. తనని తాను మార్చుకున్న విధానం, అలాగే ఒకప్పుడు మాతో ఆడినప్పటికీ, ఇప్పటికీ మైదానంలో అతడు ప్రవర్తించే తీరు పూర్తిగా మారిపోయింది. ఇప్పుడతని పూర్తి ధ్యాస క్రికెట్‌పైనే ఉంది. కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే చూస్తూ నేనెంతో ఆస్వాదిస్తా."
-ఉమర్ గుల్, పాకిస్థాన్ మాజీ బౌలర్
కొన్నేళ్లుగా విరాట్ కోహ్లీ నిలకడగా రాణిస్తున్నాడు. తన బ్యాటింగ్‌తో సచిన్ రికార్డుల్ని అధిగమిస్తున్నాడు. కోహ్లీ ఇప్పటికే 70 అంతర్జాతీయ శతకాలు సాధించాడు. అతడి వయసును పరిగణలోకి తీసుకుంటే రాబోయే కాలంలో సచిన్ 100 శతకాల రికార్డునూ తిరగరాసేలా కనిపిస్తున్నాడు. ఇక పరుగుల విషయానికొస్తే కోహ్లీ కాస్త వెనకే ఉన్నాడు. సచిన్ వన్డేల్లో 18,426, టెస్టుల్లో 15,921 పరుగులు చేశాడు. కోహ్లీ వన్డేల్లో 11,867 చేయగా టెస్టుల్లో 7,240తో కొనసాగుతున్నాడు.