ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరట్‌కు 25 కిలోమీటర్ల దూరంలోని పల్లెటూరు.. ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలున్న పేద కుటుంబం. కుటుంబ పెద్ద పాలమ్మితే తప్ప ఇల్లు గడవదు. ఇలాంటి స్థితి నుంచి వచ్చిన ఓ కుర్రాడు విపరీతమైన పోటీ ఉండే క్రికెట్లోకి అడుగు పెట్టడమే గొప్ప. అలాంటిది జాతీయ జట్టు తర్వాత అంతటి పేరున్న భారత అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా ఎదిగాడు. ఈ విధంగా పేదరికం నుంచి వచ్చి ప్రపంచకప్ వరకు అంచెలంచెలుగా ఎదిగిన ఆ కుర్రాడే ప్రియమ్ గార్గ్.
తండ్రే మార్గదర్శకుడు...
దక్షిణాఫ్రికా వేదికగా జరగబోయే అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టును నడిపించబోతున్న ప్రియమ్... ఒకప్పుడు క్రికెట్ కిట్ కొనుక్కునే డబ్బులు లేక.. కోచింగ్ తీసుకునే స్థోమత లేక విపరీతమైన ఇబ్బందులు పడ్డాడు. కానీ తనయుడికి క్రికెట్ మీద ఉన్న ఇష్టాన్ని గ్రహించిన అతని తండ్రి నరేశ్ గార్గ్... ఎలాగైనా అతణ్ని మంచి క్రికెటర్‌ని చేయాలని తపించాడు. పాలు అమ్మడమే కాక.. పాఠశాల వ్యాన్ నడపడం, కూలి పనులు చేయడం ద్వారా డబ్బులు సంపాదించి ప్రియమ్‌కు ఏ లోటు లేకుండా చూసేవాడు. కోచ్ సంజయ్ రస్తోగి శిక్షణలో ఎదిగిన అతడు.. ఉత్తర్‌ప్రదేశ్ క్రికెట్ లీగ్స్‌లో భారీగా పరుగులు సాధించి సెలక్టర్లను ఆకట్టుకున్నాడు.
అమ్మ ప్రేమ దూరమైనా...
ప్రియమ్ 11 ఏళ్ల వయసులో అమ్మను కోల్పోయాడు. ఆ సమయంలో అతడు మానసికంగా కుంగిపోయినా.. తనను క్రికెటర్‌గా చూడాలన్న అమ్మ ఆశను నెరవేర్చడం కోసం పట్టుదలతో ఆటలో కొనసాగాడు. రోజుకు 7-8 గంటలు క్రికెట్ కోసం కేటాయిస్తూనే ఇంకోవైపు చదువుకునేవాడు.
2018లో రంజీ ట్రోఫీకి ఎంపిక కావడం అతడి కెరీర్‌ను మలుపుతిప్పింది. 12 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 5 అర్ధసెంచరీలతో 867 పరుగులు సాధించిన ప్రియమ్.. మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగలడు. రంజీల్లో స్థిరంగా రాణించడం వల్ల భారత అండర్-19 జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఈ కుడి చేతి వాటం బ్యాట్స్‌మన్ బరిలోకి దిగిన తొలి రంజీ సీజన్ (2018-19)లోనే అదరగొట్టాడు. 800కి పైగా పరుగులు సాధించి సత్తా చాటాడు. గోవాతో ఆడిన తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీతో మెరిసిన ప్రియమ్.. ఆ తర్వాత తొలి ఫస్ట్ క్లాస్ డబుల్ సెంచరీ (206) కూడా సాధించాడు.
భారత జట్టులో అండర్-19 స్థాయి వరకు రాగలిగానంటే నాన్నే కారణం. ఆయన కష్టమే నన్ను నడిపించింది. స్నేహితుడి దగ్గర నుంచి డబ్బు అప్పు తీసుకుని మరీ నన్ను క్రికెట్లో కొనసాగేలా చేశాడు. 2011లో అమ్మ చనిపోవడం కోలుకోలేని దెబ్బ. నన్ను క్రికెటర్‌గా చూడాలన్న ఆమె కోరికను నెరవేర్చేందుకు శ్రమించా. కానీ భారత జట్టుకు ఆడుతున్న సమయంలో ఆమె లేకపోవడం పెద్ద లోటు.
- ప్రియమ్ గార్గ్
దేశవాళీల్లో రాణించేందుకు కోచ్ రాహుల్‌ద్రవిడ్ సలహాలు, సూచనలు తనకు బాగా ఉపయోగపడ్డాయని చెప్పాడు ప్రియమ్. దేవధర్ ట్రోఫీలో భారత్-సి తరఫున ఆడిన అతడు.. ఫైనల్లో అర్ధసెంచరీతో మెరిశాడు. సచిన్ తెందూల్కర్‌ను ఆదర్శంగా తీసుకుని ఎదిగిన ప్రియమ్‌కు.. తన ఆరాధ్య ఆటగాడిని కలిసి సలహాలు తీసుకోవాలని కోరికగా ఉందట.
భారత యువ జట్టు...
ప్రియమ్ గార్గ్ (సారథి), ధృవ్చంద్ జురెల్ (వైస్ కెప్టెన్, కీపర్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, దివ్యాంశ్ సక్సేనా, శాశ్వత్ రావత్, దివ్యాంశ్ జోషి, శుభంగ్ హెగ్డే, రవి బిష్నోయ్, ఆకాశ్ సింగ్, కార్తీక్ త్యాగి, అథర్వ అంకోలేకర్, కుమార్ కుశాగ్ర (కీపర్), సుశాంత్ మిశ్రా, విద్యాధర్ పాటిల్.
లంకతో తొలి మ్యాచ్:
సఫారీ గడ్డపై జనవరి 9 నుంచి ఈ మెగాటోర్నీ ఆరంభం కానుంది. 1988లో ఈ టోర్నీ మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా నాలుగుసార్లు విజేతగా నిలిచింది భారత్. ఇప్పడూ మంచి అంచనాలతోనే బరిలో దిగుతోంది. గత టోర్నీలో కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్గనిర్దేశంలో, కెప్టెన్ పృథ్వీ షా నాయకత్వంలో అదరగొట్టిన భారత్.. ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ గెలిచింది. 2000, 2008, 2012లోనూ టీమిండియా కప్ గెలిచింది.
రాబోయే టోర్నీలో భారత్.. గ్రూప్-ఎలో న్యూజిలాండ్, శ్రీలంక, జపాన్‌తో కలిసి ఆడనుంది. జనవరి 19న శ్రీలంకతో జరిగే మ్యాచ్‌తో టీమిండియా వేట మొదలుపెట్టనుంది.