ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ వార్త అభిమానులను నిర్ఘాంతపోయేలా చేసింది. మహీ వీడ్కోలుపై అనేక మంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ.. అతడి అద్భుతమైన ఆటతీరు ఎంతో మంది యువ క్రికెటర్లకు ఆదర్శమని కొనియాడారు. క్రికెట్ ప్రముఖులతో పాటు ధోనీ రిటైర్మెంట్పై సాధారణ అభిమానులూ స్పందించారు. 16 ఏళ్ల పాటు టీమ్ఇండియాకు మహీ ఎనలేని సేవలందించాడని ప్రశంసించారు.
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీలోని ఆటతీరుతో పాటు అతడి వ్యక్తిత్వానికి ఫ్యాన్స్ ఎక్కువ. వారందరూ అతడిని 'కెప్టెన్ కూల్'గా పిలుస్తారు. అయితే తమిళనాడులోని అభిమానులు మాత్రం ధోనీని అన్నలా భావించి 'తలా' అని ఆప్యాయంగా పిలుచుకుంటారు.
తమిళనాడులోని చెన్నిమలైకు చెందిన అప్పూసామి అనే చేనేత కార్మికుడు ధోనీపై ఉన్న అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నాడు. ధోనీ, తన కుమార్తె జీవా చిత్రాలను ఓ దుప్పటిపై వచ్చేలా మగ్గంపై నేశాడు. దానిపై 'తలా' అని ఇంగ్లీష్‌లో కనిపించే విధంగా రూపొందించాడు. గతంలో ఎంతోమంది ప్రముఖుల చిత్రాలను దుప్పట్లపై డిజైన్ చేసి గుర్తింపు పొందాడు అప్పు. ఈ దుప్పటి రూపకల్పనకు దాదాపు 15 రోజులు పట్టిందని తెలిపాడు.
ధోనీ ప్రస్తుతం ఐపీఎల్ కోసం యూఏఈ వెళ్లగా.. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత మహీని కలిసి ఆ కళాఖండాన్ని స్వయంగా తానే అందిస్తానని అప్పూసామి వెల్లడించాడు.